New Discoveries of Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. జాబిల్లిపై సౌత్‌పోల్‌పై అడుగు పెట్టిన చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ పంపించిన చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు జాబిల్లిపై భారీ పురాతన బిలం ఉన్నట్లు గుర్తించారు.
ఈ బిలానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజ్ఞాన్ రోవర్‌కు బిగించిన హై రెజెల్యూషన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ బిలం పురాతన కాలం నాటిది అని గుర్తించారు. ఈ బిలం 3.85 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి నెక్టేరియన్ కాలంలో ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది చంద్రుని ఉపరితలంపై ఉన్న అత్యంత పురాతన బిలాల్లో ఒకటి అని అన్నారు.
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ బిలం ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడి భౌగోళిక చరిత్రకు సంబంధించిన కీలక విషయాలను కనుగొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటికి సంబంధించిన వివరాలతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ సైంటిస్ట్స్ రూపొందించిన నివేదికను సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్ ప్రచురించింది.
చంద్రుడి సౌత్ పోల్‌పై ఉన్న అతి పెద్ద, పురాతనమైన ఐట్కెన్ బేసిన్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. ఈ బిలం ఐట్కెన్ బేసిన్ ఏర్పడటానికి ముందే ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. చిత్రాలలో దాదాపు అర్ధ వృత్తాకార నిర్మాణం కనిపించింది. శిథిలాల వల్ల బిలం అస్పస్టంగా ఉందని, కాలక్రమేణా ఇది క్షీణించిందని చెబుతున్నారు. ఇంపాక్ట్ బేసిన్లు 300 కి.మీ కంటే ఎక్కువ వ్యాసం కలిగిన పెద్ద కాంప్లెక్స్ క్రేటర్స్ అయితే ఒక బిలం 300 కి.మీ కంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటుంది.