YS Jagan Cheated Kapu Community: దగా, వంచన, మోసం, ఇలా ఏ పేరు పెట్టినా జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ, ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. కాపుల విషయంలో అయితే మరీ ఘోరం. అయిదేళ్లలో ఎదిగేందుకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. అంతటితోనే ఆగలేదు. కాపు కాసేందుకు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పాతరేశారు. చివరికి నిరుపేదలకు ఉపయోగపడే కాపు భవనాలపైనా కక్షకట్టారు. టీడీపీ ప్రభుత్వం కట్టిందనే అక్కసుతో నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించకుండా ఎక్కడికక్కడ వదిలేశారు.
స్కిల్ ట్రైనింగ్ అందితే కాపు యువత ఎక్కడ బాగుపడిపోతారోనని దానికీ తిలోదకాలిచ్చారు. ఇదేకాదు ఈడబ్ల్యూఎస్ కోటాలో టీడీపీ ప్రభుత్వం కాపులకు అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లనూ రద్దు చేశారు. ఇన్ని మోసాలు జగన్పై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఓట్లాటకు తెరతీసి ‘కాపు నేస్తం’ ప్రకటించారు. అంటే, ఇది కూడా మనస్ఫూర్తిగా అమలు చేసింది కాదు. అందులోనూ నిబంధనల కొర్రీలు వేశారు. అయిదేళ్లలో ఆ పథకం కింద ఖర్చు చేసింది 2 వేల కోట్ల రూపాయలే. అధికారంలోకి వస్తే అయిదేళ్లలో 10 వేల కోట్ల రూపాయలు కేవలం కాపుల అభివృద్ధికే ఖర్చు చేస్తానని చెప్పి ఆయన చేసిన దగా ఇది.
టీడీపీ ప్రభుత్వంలో 1,441 కోట్ల రూపాయల రుణాలు: ఏ వర్గమైనా పేదరికం నుంచి బయటపడటానికి ఉపాధి కల్పనే కీలకం. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదంటే, వారి ఎదుగుదలకు అడ్డుతగులుతున్నట్టే. జగన్ సీఎం అయ్యాక కాపులకు ఇదే చేశారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు కాపుల్లోని నిరుపేదలూ ముందుకు వెళ్లాలని వారికోసం కార్పొరేషన్ పెట్టింది. అందరికీ వర్తించే పథకాలను కాపులకు అమలు చేస్తూనే, 2014 నుంచి 19 మధ్య కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో కాపులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రాయితీతో రుణాలు మంజూరు చేసింది.
అదనంగా బ్యాంకులతో మాట్లాడించి రుణాలు అందించింది. ఇలా 2.11 లక్షల మందికి 1,441.75 కోట్ల రూపాయల మేర రాయితీ రుణాలను అందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనూ ఈ పథకం కొనసాగి ఉంటే మరెందరికో మేలు జరిగేది. కానీ రాయితీ రుణాల్ని ఎత్తేశారు జగన్. పైకి మాత్రం కాపులకు చాలా మేలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఇచ్చిందేంటో తెలుసా? అందరికీ వర్తించే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాలు. వాటిలో ఉండే కాపు సామాజికవర్గం వారి సంఖ్యను పక్కకు తీసి, పెద్ద సంఖ్యగా చూపించారు. జగన్‌కు మాత్రమే చేతనయ్యే అంకెల గారడీ ఇది.
‘విదేశీ విద్య’ అమలుకు మనసొప్పలేదు: తమ బిడ్డల్ని లక్షల రూపాయలు పెట్టి గొప్ప చదువులు చదివించలేక ఇబ్బందిపడే తల్లిదండ్రులకు టీడీపీ అమలు చేసిన ‘విదేశీ విద్య’ పథకం గొప్ప ఊరటగా నిలిచింది. కాపులకు దీన్ని అమలు చేసేందుకూ జగన్‌కు మనసొప్పలేదు. అధికారం చేపట్టిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని వారిని మరోసారి మభ్యపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. సాయాన్ని పెంచి అమలు చేసినట్టు పైకి చూపించినా, అమల్లోకి వచ్చేసరికి మాత్రం కుయుక్తులు పన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థులను విదేశాలకు పంపింది.
అందుకు 207 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని పరిశీలిస్తే, తొలుత 200 క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోకాలొడ్డింది. ఆ తర్వాత నిబంధనల్ని మరింత కఠినతరం చేసి సబ్జెక్ట్‌ల అంశాన్ని తెరమీదకు తెచ్చి, వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో మరోసారి సవరణలు చేశారు. జగన్ అయిదేళ్ల పాలనలో ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులు 250 మంది కూడా లేరు. ఇంతకంటే వంచన ఎక్కడైనా ఉంటుందా?