Young Entrepreneur Pratap in Kanuru :చిన్నతనం నుంచే సొంత వ్యాపారంలో రాణించాలనేది ఆ యువకుడి కల. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఏడేళ్లు పని చేశాడు. పైసా పైసా కూడబెట్టి ఎలక్ట్రికల్ ప్యానల్స్ తయారీ ఇండ్రస్టీని స్థాపించాడు. ఐదు మందితో మొదలైన కంపెనీ ద్వారా ప్రస్తుతం 34 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 మందికి ఉపాధి అందిస్తున్నాడు. ఎవరా యువకుడు? తన విజయానికి కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒకరి దగ్గర పని చేయకుండా సొంత కాళ్లపై నిలబడి మరో పదిమందికి ఉపాధి కల్పించాలి. అదే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాడీ యువకుడు. 10 ఏళ్ల క్రితం రూ.2 లక్షలతో ప్రారంభించిన పవర్ సిస్టమ్స్ కంపెనీని రూ.10 కోట్ల టర్నోవర్‌కు చేర్చాడు. ఈ యువకుడు చిరువెల్ల ప్రతాప్. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు స్వస్థలం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా తర్వాత ఓ పరిశ్రమలో పనిచేసేవాడు.
సొంత వ్యాపారం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో పవర్ సిస్టమ్స్ పరిశ్రమ నెలకొల్పాడు. ఈ కంపెనీలో అత్యాధునిక సాంకేతికత, యంత్రాల సాయంతో ప్యానల్స్ తయారు చేస్తున్నారు. వినియోగదారులు ఎప్పుడూ భద్రత చూస్తారని అందుకే తాము ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తామంటున్నాడు ప్రతాప్. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇంతటి విజయం అందించింది కొనుగోలుదారులే అని చెబుతున్నాడు.
"నేను డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేది. పరిశ్రమకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం. 2014లో ఉత్పత్తి ప్రారంభించాం. రూ.2 లక్షల పెట్టుబడి ఐదుగురు సిబ్బందితో మొదలుపెట్టాం. ప్రారంభంలో చిన్నపాటి యంత్రాలు ఉపయోగించే వాళ్లం. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నాం." - ప్రతాప్, పవర్ సిస్టమ్స్ పరిశ్రమ యజమాని