తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పాడ తీరంలో పోటెత్తుతున్న అలలు - సాగర గర్భంలో కలిసి పోతున్న నివాసాలు - SEA WAVES IN KAKINADA COASTS

ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం - సాగర గర్భంలో కలిసిపోతున్న గ్రామాలు - దశాబ్దాలుగా అంతులేని వ్యథ

sea waves in kakinada coasts
Waves Rise On the Uppada Beach (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Waves Rise On the Uppada Beach : ఆ గ్రామాల్లో ఓ మోస్తారు వర్షంపడితే చాలు అలజడి మొదలవుతుంది. ఇక తుపాను హెచ్చరిక వెలువడిందంటే చాలు మాత్రం గజగజ వణికిపోతారు. సునామీలను తలపించేలా ఎగిసిపడే రాకాసి అలలు, బలమైన ఈదురు గాలులు ఆ పల్లెల జనాలకు కంటి మీద కునుకు లేకుండాచేస్తున్నాయి. సముద్రమే జీవనాధారమైన అక్కడి ప్రజలకు ఆ సముద్రమే వారికి ఇళ్లు లేకుండా చేస్తుంది. ఇళ్లు, బడులు, గుడులు, చర్చిలు, వందల ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో మునిగిపోతాయి. అక్కడి మత్స్యకారులకు నివాసాలు లేకుండా చేసి నిరాశ్రయులుగా మారుస్తుంది. సముద్ర కోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరాల్లోని 8 గ్రామాలకు చెందిన ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా అంతులేని వ్యథనే మిగుల్చుతుంది.

సముద్రం గర్భంలో కలిసిపోతున్న భూమి : ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. తీరాన్ని ఆనుకొని సుమారు 25వేల మంది ఉంటున్నారు. వీరిలో 16 వేల మత్స్యకారులు నివసిస్తున్నారు. సుబ్బంపేట, ఉప్పాడ, జగ్గరాజుపేట, మాయాపట్నం, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేట, సూరాడపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో అనాదిగా జీవిస్తున్నారు.

చేపల వేటతో పాటు ఆయా గ్రామాల్లో పంటలు పండించే వారు. ఇప్పుడు ఆ భూమి అంతా సముద్రం గర్భంలో కలిసిపోయింది. ఉప్పాడ తీరంలో సముద్రం ఏడాది పొడవునా అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉవ్వెత్తున ఊళ్ల మీదకు ఎగిసిపడుతుంటాయి. దీంతో జనావాసాలు, పాఠశాలలు, ఆలయాలు, చర్చిలు సహా ఆయా గ్రామాల్లోని కట్టడాలు నేలమట్టమై భూమిలో కలిసిపోతున్నాయి. పంట భూములైతే నామ రూపాల్లేకుండా పోయాయి.

తుపాన్ల ధాటికి ఇండ్లు అతలాకుతలం : ఉప్పాడ తీరంలోని కోనపాపపేట కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడి అలల ధాటికి ఈ గ్రామంలోని నివాసిత ప్రాంత భూమి తీవ్ర కోతకు గురయ్యింది. 4 వేలకుపైగా జనాభా నివసించే ఈ గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు 200 మీటర్ల పరిధిలో ఇండ్లు ఉంటాయి. సుమారు 650 మంది మత్స్యకారులు సముద్రాన్ని ఆనుకొని నివసిస్తుంటారు. తుపాన్ల ధాటికి కడలి కోతకు గురవ్వడంతో 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. సుమారు 400 మంది నిరాశ్రయులయ్యాయి.

ప్రస్తుతం 50 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కడలిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో నివాసం ఉంటున్న 70 కుటుంబాలకు చెందిన 250 మంది మత్స్యకారుల జీవనం ఇబ్బందికరంగా మారింది. ఉప్పాడతో పాటు మిగతా తీర ప్రాంత గ్రామాలదీ ఇదే పరిస్థితి. రెండు నెలల వ్యవధిలో మూడు సార్లు వచ్చిన తుపాన్ల ధాటికి ఈ తీర ప్రాంత గ్రామాలు కనుమరుగవుతున్నాయి.

పేరుకే ఆ ఊళ్లు - జనాలు మాత్రం ఉండరు : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ ప్రాంతాల్లోని అంతర్వేది, తూర్పుపాలెం, కరవాక, ఓడలరేవు, ఎస్. యానాం, కాట్రేనికోన, తాళ్లరేవుతో పాటు పుదుచ్చేరిలోని యానాం తీరాల్లో సముద్రం ఒక్కో తీరుగా మారుతూ ఉంటాయి. తూర్పుపాలెం, అంతర్వేది, ఓడలరేవు ప్రాంతాల్లో అప్పుడప్పుడు సముద్రం అల్లకల్లోంగా మారి కెరటాలు గ్రామాల్లోకి దూసుకురావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం అల్లకల్లోలం : గౌతమీ గోదావరి నది యానాం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు, కాకినాడ శివారు వరకు పాయలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో వేల ఎకరాల్లో మడ అడవులు ఉన్నాయి. అలాగే గోదావరి నది ఇసుక మేటలతో సహజ సిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్ కాకినాడ నగరానికి రక్షణ కవచంలా ఉంది. దీంతో కాకినాడ తీరంలో సాగరం నిశ్చలంగా ఉంటుంది. కాకినాడ నుంచి ఉప్పాడ-కోనపాపపేట వైపు వెళ్లే కొద్దీ కెరటాల ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఊళ్ల మీదకు ఎగిసి పడుతుంది. తుపాన్ల సమయాల్లో అయితే కెరటాలు మరింత బీభత్సం సృష్టిస్తాయి.

ఫెయింజల్​ తుపాన్ ఎఫెక్ట్​ - 20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

బీచ్​లో భారీగా మరణించిన చేపలు- కిలోమీటరు వరకు ఎటు చూసినా అవే!

ABOUT THE AUTHOR

...view details