SLBC Tunnel Collapse Update :శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. వీరి గురించి ఒతవైపు సైన్యం, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, బీఆర్‌వో, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా వారి దగ్గరికి చేరుకోవడానికి అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయి.
బుధవారం ఉదయం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి టన్నెల్‌వద్దకు చేరుకొని సహాయక చర్యలను పరీక్షించారు. సొరంగం పనులు చేస్తున్న జేపీ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు జైప్రకాశ్‌గౌర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దోమల పెంటకు చేరుకున్నారు.
తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష : మంత్రులు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోశ్, ఎస్పీ వైభవ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీతో కలిసి ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, రాబిన్‌సన్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. టన్నెల్‌లో పరిస్థితి, అదనంగా తీసుకోవాల్సిన చర్యలు, వినియోగించాల్సిన మానవ వనరులు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై చర్చించారు.
టన్నెల్‌లో సహాయ చర్యలు :టన్నెల్‌లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేటవేసి ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కార్మికుల క్షేమంపై రోజురోజుకూ ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. దీంతో గురువారం సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలనుకుంటుంది. ఘటన స్థలానికి చేరువలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.