ULAVAPADU MANGOES: ఉలవపాడు మామిడికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలనిపిస్తుంది. ఎంతో ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడికి వాతావరణ మార్పులతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వరుసగా నష్టాలు రావడంతో రైతులు తోటలను నరికేసి, ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఉలవపాడు మామిడికి ఉన్న ప్రత్యేక గుర్తింపు నిలుపుకొనేలా, అదే విధంగా రైతులకు లాభాలు వచ్చేలా ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా కసరత్తు ప్రారంభించింది.
తోటల పునరుద్ధరణ:నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులోని తోటలన్నీ 30 సంవత్సరాలకు పైబడినవే. ఇందులో ఎక్కువ శాతం 50 ఏళ్లున్న చెట్లు ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే 40 సంవత్సరాలు దాటితే కాపు తగ్గుతుందని అంచనా. ఈ దశలో ఎక్కువ సంవత్సరాలు దాటిన చెట్లను పునరుద్ధరించుకోవడం (రెజోనేషన్) అవసరం. భారీగా పెరిగిన కొమ్మలను తొలగించి, చెట్ల మధ్య గాలి, సూర్యరశ్మి ఉండేలా చేసుకోవాలి. కొమ్మలు నరికితే కాయలు రావు అనే అపోహను వీడాలి. పైగా తోటలకు సరిగా నీళ్లు పెట్టడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోనో, మార్చి మొదటి వారంలోనో చెట్లకు నీళ్లు పెట్టడం మంచిది అని కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.ప్రసాద్‌బాబు అంటున్నారు.
కాయలు ఇలా కోస్తే మంచిది:చాలామందిరైతులుకాయలను ఎప్పటికప్పుడు కోయకుండా ధర కోసం లేదా అన్నీ ఒకేసారి కోదామనే ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నారు. అయితే ఇలా ఆగస్టు, సెప్టెంబరు వరకు ఉంచకుండా, ముందుగానే కాయలను కోయడం వలన వచ్చే ఏడాది కాపు త్వరగా వస్తుంది. కొత్తగా తోటలు వేసే వారు నేల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని జి.ప్రసాద్‌బాబు తెలిపారు. అలా చేయడం వలన పెట్టుబడులు తగ్గుతాయని వివరిస్తున్నారు.