TTD Arrangements For Vaikuntha Ekadashi : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ తిరుమల దేవస్థానం పలు నిర్ణయాలు తీసుకుంది. పది రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూలైన్లోనికి అనుమతిని నిరాకరించారు. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు :భారీ క్యూలైన్లను నివారించి గరిష్ఠ సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి స్పెషల్ దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే వారు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. మొదటి రోజు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతిని టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) నిరాకరించింది. గత ఎడాది వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం అధికారులు అవలంబిస్తున్నారు. తిరుపతి స్ధానికుల కోటా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.