Temperatures in Andhra Pradesh: ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 72 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వడగాల్పుల తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా సరే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
Precautions From Summer: ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు- 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు - Summer Heat Waves in Andhra pradesh