Govt Orders to Stop Ethanol Industry Works:తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని సర్కారు ఆదేశించింది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు, స్థానికుల ఆందోళనపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు నివేదిక ఇచ్చారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ సూచనల మేరకు ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చేపట్టిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేయగా వారు పరుగులు తీశారు. ఈ క్రమంలో మహిళలు సైతం పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలంటూ దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. నవంబర్ 26న కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా అక్కడికి వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని కారుకి నిప్పంటించే ప్రయత్నం చేశారు.