Telangana Govt withdraws Lagacharla Land Acquisition :లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో లగచర్లతో పాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీ కోసం 1358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజి బదులుగా మల్టీపర్పస్ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. రానున్న ఇండస్ట్రియల్ పార్కులో టెక్స్ టైల్, కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ :లగచర్ల రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది. మూడు గ్రామాల్లో 1358 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది.
ఫార్మా విలేజీల కోసం లగచర్లలో 632 ఎకరాలు, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం జూన్ 7న టీజీఐఐసీ 1358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు ఇచ్చింది. టీజీఐఐసీ ప్రతిపాదనల మేరకు పట్టా, అసైన్డు భూముల సేకరించేందుకు తాండూరు ఆర్డీవోను జూన్ 28న భూసేకరణ అధికారిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచర్లలో 632 ఎకరాల భూసేకరణకు జులై, ఆగస్టులో అనుమతిచ్చారు.
మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు :అయితే ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం పునస్సమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మావిలేజి కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్‌కు టీజీఐఐసీ తెలిపింది. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ నేపథ్యంలో గతంలో ఫార్మా సిటీ విలేజీల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు. తాజాగా ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రైతుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న పారిశ్రామిక పార్కులో టెక్స్ టైల్, కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర సంస్థలకైతే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
లగచర్ల ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం - గ్రామానికి రానున్న ప్రత్యేక బృందం
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?