TDP YSRCP Clashes in YSR Kadapa District: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయి. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చిన్న గులవలూరులో వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను వైఎస్సార్సీపీ నాయకులు బయటకు లాగేశారు. గుంపులుగా వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ ఏజెంట్‌పై దాడిచేసి బయటికి లాగి పడేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో టీడీపీ ఏజెంట్ ఉగ్ర నరసింహులుకు తీవ్రగాయాలు అయ్యాయి.
వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటకు లాగి కొట్టడంపై ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారి అనుచరులు దౌర్జన్యకాండ పెరిగిపోతుందని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దలవాయిపల్లె గ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఎన్నికల అధికారులు కొత్త ఈవీఎం ఏర్పాటు చేసి ఎన్నికలు మళ్లీ కొనసాగించారు.
అదే విధంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం కోగటంలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు కూర్చునే సమయంలో తెలుగుదేశం నాయకులు ఎక్కువగా ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పారు. ఎవరైనా గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వైఎస్సార్సీపీ నాయకుల కవ్వింపు చర్యలు:ప్రొద్దుటూరు మండలం కామనూరులో వైఎస్సార్సీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడి కుమారుడు రాఘవేంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది బంగారు మునిరెడ్డి కుమారుడు విజయముని రెడ్డిలు ఏజెంట్ ఫారం లేకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి అనుచరులు అభ్యంతరం తెలిపారు. దీంతో బయటికి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు వరదరాజుల రెడ్డి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసుల ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.