Nara Lokesh on Geetanjali Death: గీతాంజలి మృతి ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసారు. 2019లో బాబాయ్ ని బలి తీసుకున్న వైసీపీ, ఇప్పుడు గీతాంజలిని ఎందుకు బలి తీసుకుందో అంటూ ప్రశ్నించారు. బలి జాబితాలో ఇంకెందరు ఉన్నారో అంటూ నిలదీశారు.
శవంతో వికృత రాజకీయాలు: సైకో జగన్ పార్టీ, తండ్రి శవం దగ్గర పుట్టిందని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. బాబాయ్ శవంతో ఓట్లు దండుకుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ మృతదేహంతో వికృత రాజకీయాలు ఆరంభించిందని మండిపడ్డారు. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారన్నారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురి అయిందో, ఆత్మహత్యాయత్నం చేసుకుందో తెలియదు గానీ, తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స కూడా అందించే ప్రయత్నం వైఎస్సార్సీపీ సైకోలు చేయలేదని లోకేశ్ (Lokesh) ధ్వజమెత్తారు.
10వ తేదీన ప్రశ్నించారు: గీతాంజలి 4 రోజులు మృత్యువుతో పోరాడితే వైఎస్సార్సీపీ సైకోలు అటువైపు కూడా చూడలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చనిపోతే మాత్రం ఆ మృతదేహంతో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. గీతాంజలితో వైఎస్సార్సీపీలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ, టీడీపీ అభిమానులు ఆధారాలతో 10వ తేదీన ప్రశ్నించారు. 7వ తేదీన గీతాంజలి గాయపడిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే బాబాయ్ గొడ్డలిపోటుని గుండెపోటుగా ప్రచారం చేసిన గ్యాంగ్ ఈ మరణాన్నీ తమ వికృత రాజకీయాలకు వాడుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోందని లోకేశ్ ఆరోపించారు.