SWARNANDHRA VISION 2047 DOCUMENT: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్‌పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతకం చేశారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను 10 సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని డ్వాక్రా మహిళ సుహాసిని తెలిపారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రభుత్వం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. (ETV Bharat) CM on Swarnandhra Principles: అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీ4 విధానంలో) పేదరిక నిర్మూలన చేయాలని సూచించారు. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచీ ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యాడన్న సీఎం, విజన్ 2047లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రమని తెలిపారు.
ఇందులో భాగంగా పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చు తగ్గులను సమన్వయం చేయటాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. నైపుణ శిక్షణ ఇప్పించి, మానవవనరుల అభివృద్ధి చేయటం మూడో సూత్రంలో ప్రధానమని తెలిపారు. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తూ, నీటిభద్రతకు ప్రాధాన్యమివ్వాలనే నాలుగో సూత్రంతో కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి సాంకేతికత పెంచి, గౌరవంగా జీవించేలా చేసేందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తూ ఆరో సూత్రంగా విజన్‌లో చేర్చామని చంద్రబాబు వివరించారు.
CM on Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాందిపలికారని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పని చేస్తుంటే తెలుస్తోందని అన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే, అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. నేడు 3 వేల డాలర్లకంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి 42 వేల డాలర్లకు పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారన్నారు. సంస్కరణలు ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
CM On Swachandra Stalls: స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ ఏర్పాటుకానుందని పలువురు తెలిపారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు - వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందింది.
అప్పటికి ఏపీ ఎలా మారనుంది? - స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్