Supreme Court Fire On YCP Govt on Illegal Sand Mining Increasing : మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైఎస్సార్సీపీ పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంత కాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇసుక అక్రమ తవ్వకాల నెపాన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులపైకి నెట్టి చేతులు దులిపేసుకునేందుకు చూస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదో వివరణ ఇవ్వాలని, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కొన్ని జిల్లాల గనులశాఖ ఏడీలు, విజిలెన్స్ ఏడీలకు తాఖీదులు ఇవ్వడంతో ఆ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా గనులశాఖలోని ఇద్దరు కీలక అధికారులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడుతున్నారు.
Supreme Court Serious On Illegal Sand Mining in AP :ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలువురు గనులశాఖ సంచాలకులు (జిల్లా గనులశాఖ అధికారులు), జిల్లా విజిలెన్స్ స్క్వాడ్ ఏడీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నోటీసులిచ్చారు. మీ జిల్లాల్లోని కృష్ణా, గోదావరి నదుల్లో రీచ్ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, యంత్రాల వినియోగం వంటివి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ వాటిలో పేర్కొన్నారు. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ సంచాలకులు ఈ తాఖీదులు ఇచ్చారు. ఏ జిల్లాలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎస్టిటీకి) కొన్నాళ్ల కిందట నివేదిక ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు - ఇసుక రీచ్ల బాట పట్టిన కలెక్టర్లు - COLLECTORS INSPECTION
గనులశాఖ ఉన్నతాధికారులు సూచించిన రీచ్‌లో మాత్రమే తనిఖీలు చేసి, అక్కడ ఎటువంటి తవ్వకాల్లేవని నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభ యగోదావరి జిల్లాల్లోని పలు రీచ్‌లలో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని, కొన్ని రీచ్ల హద్దులు దాటి తవ్వకాలు సాగిస్తున్నారని, భారీ యంత్రాలను వినియోగిస్తున్నారని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికలన్నీ తప్పేనని తేట తెల్లమైంది. ఈ విషయం తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగానూ ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. దీంతో గనుల శాఖ ఉన్నతాధికారులు అక్రమాలు చేసిన గుత్తేదారు సంస్థను, వైఎస్సార్సీపీ నేతలను వదిలేసి ఆఘమేఘాలపై ఆయా జిల్లాల మైనింగ్ ఏడీలకు తాఖీదులిచ్చి, వివరణ కోరారు.