Roads Damage in Sangareddy District :సంగారెడ్డి జిల్లాలో మెుత్తం ఐదు నియోజకవర్గాలున్నాయి. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్. ఇందులో నారాయణఖేడ్, జహీరాబాద్ అభివృద్ధిపరంగా వెనుకబడిన నియోజకవర్గాలు. ఎప్పుడో వేసిన రోడ్లే తప్ప, కొత్తగా నిర్మించిది లేదు. గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ గోతులు ఏర్పడి, వాహనాల రాకపోకలకు నిత్యం అంతరాయం ఏర్పడుతోంది.
సంగారెడ్డి మండలంలోని ఉత్తరపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక బస్సు సౌకర్యాన్ని సైతం నిలిపేశారు. విద్యార్ధులు, ఉద్యోగులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆందోల్ మండలంలోని అంతర్గత రోడ్లు కూడా పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గం తీసుకున్నా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదే నారాయణఖేడ్‌లో అయితే పెద్ద పెద్ద కంకర రాళ్లు రోడ్లపై తేలాయి. అన్ని అంతర్గత రోడ్లలన్నీ అధ్వానంగా మారాయి. వాహనాలపై ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.' - స్థానికులు
Sangareddy People Suffering Roads Damage :పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్‌చెరు ప్రాంతంలో కూడా అంతర్గత రోడ్ల పరిస్థితి(Roads Damage) అధ్వానంగా తయారైంది. జహీరాబాద్ మండలంలోని రోడ్లపై పూర్తిగా రాళ్లు తేలాయి. ఈ రెండు పట్టణాలను కలుపుతూ వెళ్లే రోడ్లపై అధిక లోడ్లతో పెద్దపెద్ద లారీలు ప్రయాణిస్తుంటాయి. వీటి వల్ల భారీగా గుంతలు ఏర్పడ్డాయి. జిల్లాలోని అంతర్గత రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.