Rabi Paddy Procurement in Telangana 2024 : రాష్ట్రంలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్ల(Grain Purchase Centres) ప్రక్రియ ప్రారంభించిన దృష్ట్యా సేకరణ ప్రశాంతంగా జరుగుతోంది. తాజా రబీ పంట కాలం ముగింపు దశకు చేరుతున్న వేళ వరి కోతలు ఆరంభమైన నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ఐదు ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది.
రాష్ట్రంలో రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతోంది. గత ఏడాది యాసంగిలో ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కూడా కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది. మార్చి చివరి వారం 25వ తేదీ నుంచే సెంటర్లు ప్రారంభమయ్యాయి.
Yasangi Grain Purchase in Telangana : ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ ఇప్పటికే 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. మిగతా 1,727 కొనుగోలు కేంద్రాలు మరో రెండు రోజుల్లో తెరిచేందుకు సన్నద్ధమైంది. వేసవి ఎండలు తీవ్రత ప్రభావం దృష్టిలో పెట్టుకుని రైతులకు(Paddy Farmers) ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి దాకా పౌరసరఫరాల సంస్థ ద్వారా 443 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతులు నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.