Precautions Should Be Taken While Driving In Snow Fog :న్యూ ఇయర్, సంక్రాంతి రానుండటంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. దూర ప్రాంతలకు వెళ్లేవారు తెల్లవారుజామునే కార్లలో బయలుదేరుతారు. శీతాకాలం కావడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఓఆర్‌ఆర్, జాతీయ రహదారులపై పొగ మంచు కమ్ముకుంటోంది. ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరి వరకు వస్తే కానీ కనిపించవు. రోడ్డుపక్కన ఆగి ఉన్న వాహనాలు కనిపించక స్పీడ్‌గా వెళ్లి వాటిని ఢీకొని ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తారసపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
- పొగ మంచు ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రయాణాలు అత్యవసరం అయితేనే చేయాలి. తప్పక వెళ్లాల్సి వస్తే తక్కువ వేగంలో నడపాలి.
- రాత్రి ప్రయాణంలో ఎక్కువ మంది హైబీమ్ లైట్లు వినియోగిస్తుంటారు. పొగ మంచులో ఈ లైట్ల వల్ల కాంతి పరావర్తనం చెందుతుంది. దీంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించక ప్రమాదాలు జరుగుతాయి. ఆ సమయంలో లో బీమ్ లైట్లు వినియోగించడం మంచిది. ఫాగ్ లైట్లు వాడటం మేలు. ఈ లైట్లతో 25 మీటర్ల వరకు కూడా స్పష్టంగా చూడొచ్చు.
- ఇలాంటి సమయాల్లో వాహనాలను రోడ్డు పక్కన నిలపకూడదు. ఇంక ఈ పొగమంచులో ప్రయాణం సాధ్యం కానప్పుడు సురక్షితమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఆగాలి.
- పొగ మంచులో వాహనం నడుపుతున్నప్పుడు హెడ్ లైట్స్ డిప్ చేయాలి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనం స్పష్టంగా కనిపించడానికి అవకాశముంది.
వైరల్ వీడియో : ర్యాష్ డ్రైవింగ్‌తో వాహనాలపైకి దూసుకెళ్లి - ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి
- చాలా మంది కార్లలో మ్యూజిక్ వింటూ డ్రైవింగ్ చేస్తుంటారు. పొగ మంచు సమయంలో ఇలాంటివి ఆపేస్తే బెటర్. అద్దాన్ని కొద్దిగా దించి బయట వాహనాల శబ్దాలను జాగ్రత్తగా గమనించాలి.
- వాహనానికి ముందు, వెనుక రేడియం స్టిక్కర్లు అతికించాలి. దీనివల్ల వాహనం ముందు, వెనుక నుంచి వచ్చేవారికి కార్ ఉన్నట్లు అర్థమవుతుంది.
- ప్రయాణానికి ముందు కార్ సిగ్నల్ లైట్లు సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి. మలుపులు తిరిగే చోట ఇవి చాలా ఉపయోగపడతాయి.
- కొన్ని రైల్వే లైన్ల వద్ద కాపలాదారు ఉండరు. ఈ సమయంలో పొగమంచు వల్ల అటుఇటు పట్టాలు కనిపించవు. ఆ సమయంలో నెమ్మదిగా వెళ్లాలి.
- ఇప్పటికే అస్తమా, సీవోపీడీ ఇతర శ్వాసకోశ వ్యాధులుంటే జాగ్రత్త పడాలి. చలి, పొగమంచులో బయటకు వెళ్లడం వల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశముంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఈ వాతావరణం మరింత ప్రమాదకరం. చల్లని గాలి ముక్కు, చెవుల్లో దూరి ఊపిరితిత్తుల్లో కఫం చేరి ఇన్‌ఫెక్షన్ల వచ్చే అవకాశముంది.
- గుండె వ్యాధులు ఉంటే అప్రమత్తత అవసరం. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కు, నోరు, చెవులు కప్పి ఉంచేలా మాస్క్, మంకీ క్యాప్ వంటివి ధరించి ప్రయాణాలు చేయాలి.