Police Shifted Posani Krishna Murali to Obulavaripalle: వైఎస్సార్సీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్య పదజాలం, బూతులతో పేట్రేగిన సినీనటుడు పోసాని కృష్ణమురళిని కాసేపట్లో పోలీసులు రైల్వేకోడూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్లోనే పోసానికి ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పోసాని స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు పోసానిని కలవాలంటూ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాది నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొరముట్ల శ్రీనివాసులును పోలీసులు వెనక్కి పంపారు. శ్రీనివాసులు కాసేపు గేటు వద్దే నిలబడి పట్టుపట్టగా, తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హితవు పలికారు. పోసాని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారని చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు మాటలు మాట్లాడేవాళ్లకు ఈ రాష్ట్రంలో చోటు ఉండరాదనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారు మణి చెప్పారు.