AP Government MoU With People Tech Enterprises:కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు మరోో భారీ పరిశ్రమ రానుంది. ఈవీ కార్ల తయారీ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఉన్న పీపుల్ టెక్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రులు నారా లోకేశ్, భరత్‌ల సమక్షంలో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ఒప్పందం చేసుకుంది. కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల ఎలక్ట్రిక్ వాహన పార్క్, ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ స్థాపించనున్నారు. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీని మొత్తం 1,800 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమర్థవంతమైన ఎకోసిస్టమ్:ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని ముందుకు తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్‌ను నూతన పెట్టుబడులకు ప్రాధాన్య కేంద్రంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమర్థవంతమైన ఎకోసిస్టమ్ రూపొందించడంలో పెద్ద ముందడుగుగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఆంధ్రప్రదేశ్‌కు భారతదేశ ఈవీ విప్లవంలో నాయకత్వంలో నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తుందని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ పార్క్ కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు భవిష్యత్ గ్రీన్ మొబిలిటీ కోసమని మంత్రి భరత్ స్పష్టం చేశారు.
పరిశ్రమలకు గమ్యస్థానంగా రాష్ట్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు తగ్గట్టుగా రాష్ట్రం పరిశ్రమలకు గమ్యస్థానంగా ఎదుగుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అందరూ కలిసి భవిష్యత్తు తరాలకు సరికొత్త రాష్ట్రాన్ని అందివ్వాలని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లాలోని ప్రైవేటు ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు, ఓర్వకల్లులో మొబిలిటీ వ్యాలీ భారతదేశ ఈవీ పర్యావరణ వ్యవస్థకు గేమ్ ఛేంజర్లు కానున్నాయని అభిప్రాయపడ్డారు.