Palnadu Sister Dhana Laxmi And Papa Shines in Several Sports :పేదరికం ప్రతిభకు పరీక్షలు మాత్రమే పెట్టగలదు కానీ, విజయాలను అడ్డుకోలేదు. అదే విషయాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన ఆ క్రీడాకుసుమాలు కఠోర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్, వాలీ బాల్, రన్నింగ్ ఇలా అనేక క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇంతటి ప్రతిభ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
తినటానికి సరైన తిండి లేదు. ఉండటానికి కనీసం ఇల్లు లేదు. ఆడేందుకు అవసరమైన ఆట సామగ్రి లేదు. క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బుల్లేవు. ఉన్నదల్లా కొండంత ఆత్మవిశ్వాసం. కష్టపడే నైజం. ఇదే స్ఫూర్తితో క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ఆర్ధిక సమస్యలు సాకు చూపి ఎంచుకున్న ఆటలో తడబడుతున్న ఈ తరానికి సవాలు విసురుతున్నారు. ఆర్ధికంగా చేయూత అందిస్తే దేశానికి మంచి పేరును తీసుకొస్తామంటున్నారు.
ప్రకృతిలో లభించే వనరులతో ఉత్పత్తులు - చిన్న ఆలోచనలతో ఆదాయం
నేటి యువతకు ఆదర్శం : పల్నాడు జిల్లా యాడ్లపాడుకు చెందిన కోడిరెక్క అన్నమ్మకు ఇద్దరు కుమార్తెలు. పేర్లు ధనలక్ష్మీ, పాప. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లి కూలీ పనులకు వెళ్తూ కూమార్తెలను చదివిస్తూ క్రీడల్లో ప్రోత్సహిస్తుంది. జీవితంలో కష్టాలు తప్పా ఏమీ సాధించలేమని అనుకుంటున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ క్రీడాకారిణులు. షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో అనేక విజయాలు సాధించారు.