Nara Bhuvaneswari Nijam Gelavali Yatra :తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినవారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. ప్రతి కుటుంబాన్నీ కలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. తూర్పుగోదావరిజిల్లా నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగిస్తున్నారు. అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలులో ప్రసిద్ధిగాంచిన గోలింగేశ్వరస్వామి ఆలయాన్ని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు నారా భువనేశ్వరికి పూర్ణకుంభ స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయంలో స్వామివారికి నారాభువనేశ్వరి పట్టు వస్త్రాలు సమర్పించారు.
నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం
ధైర్యం నింపిన నారా భువనేశ్వరి : చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో గుండెపోటుతో మృతి చెందిన రొక్కల రాణి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగాబాధిత కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే విధంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరాహారదీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన పెద్ద సత్తియ్యను పరామర్శించి రూ.20వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న భువనేశ్వరి ధైర్యం నింపారు. ఈ సందర్భంగా బాధ్యత కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి పరామర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మానసికంగా ఆర్థికంగా కుంగిపోతున్న తమ కుటుంబానికి ధైర్యం చెప్పి నారా భువనేశ్వరి ఆదుకున్నారని వారు తెలిపారు.