NANDAMURI BALAKRISHNA IN NIMMAKURU: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయన స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో మాటామంతి కలిపారు. గ్రామంలోని పెద్దలను, బంధువులను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య, కుటుంబ విషయాలను పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్మకూరులోని తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తనకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డలకు అవార్డు ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు. త్వరలోనే తన తండ్రి ఎన్టీఆర్కి భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నామని అన్నారు. అమరావతిలో కూడా ఆసుపత్రిని నిర్మించేందుకు దాతలు సహకారం ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
తన తండ్రి నందమూరి తారక రామారావు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. దేశంలో ఏ నేత చేయనన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూసి, అధికారం ఇచ్చారని తెలిపారు. కాబట్టి అటువంటి మహోన్నత నేతకు త్వరలోనే కేంద్రప్రభుత్వం భారతరత్న ఇస్తుందని, ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలే పేర్లు మార్చి తీసుకొస్తున్నారని బాలకృష్ణ అన్నారు.