Missing Cases Chased By Special Police Team Of vijayawada Commissionerate : 14 సంవత్సరాల ఆ బాలికకు చదువంటే ప్రాణం. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తల్లిదండ్రులు ఆమెను పనిలో పెట్టారు. పని చేయడం ఇష్టం లేని బాలికవిజయవాడ శివారు నిడమానూరు గ్రామంలోని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2017లో జరిగింది.
19 ఏళ్ల యువతికి పటమటలో ఉండే ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. పెళ్లి ఇష్టం లేని యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 2021లో దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
మరో యువతి వయసు 19. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. కుటుంబసభ్యులతో పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లకు వెళ్లారు. అక్కడ ఆమె తప్పి పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలిస్తే ఆటో ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. ఆమె వద్ద సెల్ఫోన్ లేదు. పేరు వివరాలు సరిగా చెప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగింది.
ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీసీపీ గౌతమిశాలి పర్యవేక్షణలో సీఐ చంద్రశేఖర్, ఎస్సై హైమావతి నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అత్యంత సున్నితమైన పై మూడు కేసులను వీరు చేధించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరితో పాటు మతిస్థిమితం లేని యువతిని సైతం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడేళ్లుగా ముందుకు కదలని బాలిక అదృశ్యం కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.