Atchannaidu on Agriculture Sector : ఏపీలో ఖరీఫ్ సీజన్‌కు పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదు కావటం శుభసూచికమన్నారు. ఉపాధిహామీలో పంట కాలువలు పూడిక తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పంట పొలాల్లో నీటి నిల్వ తొలగింపు, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు చేస్తున్నామని వివరించారు. అమరావతిలోని వెంకటపాలెెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే ప్రారంభ నిల్వలతో కలిపి 14 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన ఎరువులు సకాలంలో అందించేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.