Local Bodies Elections Issue :గడువు తీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో వెల్లడించారు. దీంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడువస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఆశావహుల ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లైంది. గత ఎనిమిది మాసాలుగా ప్రజలతో మమేకమై స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వీరి కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.
రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి : కులగణన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై గణాంకాలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ 2025లోనే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ కులగణనపై ముఖ్యమంత్రి ప్రకటన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ నేపథ్యంలో గత సర్కారు అమల్లోకి తెచ్చిన ‘పంచాయతీ రాజ్ చట్టం-2018 అమలుపై సందిగ్ధం ఏర్పడింది.
ఒక వేళ పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశమున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఇదే జరిగితే పాత రిజర్వేషన్ల ప్రాతిపదికన గత 8 నెలలుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఆలోచనలు తారుమారయ్యే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.