తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 1:02 PM IST

ETV Bharat / state

అడవితల్లి ఉండమంటే - 'వేదన' వెళ్లమంటోంది - అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది? - TRIBALS LEAVING FOREST IN ASIFABAD

Ringareet Village in Kumuram Bheem Asifabad District : దశాబ్దాల క్రితం అడవిని ఆనుకుని అక్కడ ఓ కుగ్రామం ఏర్పడింది. అక్కడ ఊరు ఉన్నట్టు కానీ, మనుషులు నివసిస్తున్నట్లు గానీ పెద్దగా ఎవరికీ తెలియదు. ఇటీవల అటవీ అధికారుల తనిఖీలతో ఒక్కసారిగా ఆ గ్రామంలో కలకలం మొదలైంది. రాత్రింబవళ్లు లేకుండా అధికారుల తనిఖీలు, వేధింపులతో ఆ ఊరు జనం విసిగిపోయారు. ఇన్నాళ్లూ అడవి తల్లి ఒడిలో సేదతీరిన ఆ ప్రజలకు, అధికారులు మనశ్శాంతి లేకుండా చేస్తుండటంతో వారు ఆ గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. ఇంతకీ అది ఏ గ్రామం? అటవీ అధికారులు ఎందుకు తనిఖీలు చేస్తున్నారు? అసలక్కడ ఏం జరుగుతోంది?

Kumuram Bheem Asifabad District
Kumuram Bheem Asifabad District (ETV Bharat)

Tribals Leaving Ringareet Village in Asifabad :అడవి తల్లే వారికి తల్లీదండ్రులు. పచ్చని చెట్లే వాళ్లకు చుట్టాలు. గలగల పారే సెలయేళ్లే వారికి స్నేహితులు. అలా దశాబ్దాల నుంచి బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా అడవి తల్లి ఒడిలో సేద తీరుతున్నారు ఆ గ్రామస్థులు. అడవిలోనే రింగారీట్ అనే పేరుతో కుగ్రామాన్ని ఏర్పరుచుకుని దాదాపు ఓ 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్న ఆ ప్రజలు, ఇప్పుడు ఆ అడవి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. పచ్చని అడవి తప్ప ఏమీ తెలియని జనం, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాలు, ఉన్నపలంగా అడవిని విడిచి వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే?

ఆ ఘటనతోనే కష్టాలు షురూ :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో రెండు వాగులకు అవతల, పెద్ద గుట్టలకు ఆనుకుని కొలాం కుటుంబాలు నివసించే రింగారీట్ అనే గ్రామం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకుండా, పచ్చని చెట్ల మధ్యే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే గతంలో ఈ ఊరు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఈ గ్రామానికి చెందిన యువకులు కాగజ్​నగర్ అడవుల్లోని రెండు పులులపై విష ప్రయోగం చేసి చంపేశారనే ఆరోపణలతో ఈ ఊరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను అదుపులోకి తీసుకుని అధికారులు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.

రాత్రింబవళ్లు పహారా : అయితే ఈ ఘటన అక్కడితో ఆగిపోలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచే రింగారీట్ గ్రామానికి కొలాం గిరిజనులకు కష్టాలు షురూ అయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, తరచూ ఈ గ్రామంలో తనిఖీలు నిర్వహించడం మొదలుపెట్టారు. రాత్రింబవళ్లు ఆ ఊరు చుట్టూ పహారా కాస్తున్నారు. నిరంతరం ఈ ఊళ్లోకి వచ్చి రైతుల ఇళ్లలో, చేలల్లో తనిఖీలు చేపట్టడం గ్రామస్థులకు ఇబ్బందిగా మారింది.

వేదన భరించలేకపోతున్నాం :అడవికి వెళ్లినా, చేనుకు వెళ్లినా, పశువులు కాయడానికి అడవి వైపు వెళ్లినా, అడవి నుంచి పొయ్యి కట్టెలు తీసుకువచ్చినా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక అధికారులు తమను వేధిస్తున్నారంటూ, తట్టుకోలేకపోతున్నామంటూ ఓ కుటుంబం ఏకంగా ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ మిగతా కుటుంబాలూ అదే బాటలో ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఏళ్ల తరబడి అక్కడే జీవనం సాగిస్తూ, బతుకుదెరువు ఏర్పరుచుకున్న కొన్ని కుటుంబాలు మాత్రం అక్కడి నుంచి వెళ్లలేక మనోవ్యథకు గురవుతున్నాయి.

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే కొలాం గిరిజనులు కొత్తవాళ్లను చూస్తే భయపడుతుంటారు. వారున్న ప్రాంతానికి కొత్త వారెవరైనా వస్తే, దాదాపుగా ఇంట్లో నుంచి బయటకు రారు. అలాంటిది యూనిఫామ్​లో నిత్యం అటవీ అధికారులు, పోలీసులు పహారా కాస్తుండటంతో భయభ్రాంతులకు గురవతున్నామని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details