Industries are Showing interest Set up Global Capability Centers in Visakha : జీసీసీ (గ్లోబల్ కేపబులిటీ సెంటర్) లను ఆకర్షించడంలో దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిపోతోంది. ఈ విషయంలో మెట్రో నగరాలతో, మౌలిక సదుపాయాలు బాగున్న రెండో అంచె నగరాలు గట్టిగా పోటీపడుతున్నాయి. ఇతర ద్వితీయ శ్రేణి నగరాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పెద్దదైన, సముద్రతీర నగరం విశాఖపట్నంలో జీసీసీలు ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన ‘ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ’ ఇందుకు ఉపకరించనుంది. దీనిప్రకారం ఏపీలో ఏర్పాటయ్యే జీసీసీలకు పలు రకాల రాయితీలు లభిస్తాయి. విశాఖపట్నంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత బహుళ జాతి కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉందని అంచనా.
అగ్రస్థానంలో బెంగళూరు, హైదరాబాద్
ఏఎన్‌ఎస్‌ఆర్ రీసెర్చ్ అనే కన్సల్టింగ్ సేవల సంస్థ తాజా నివేదిక ప్రకారం, మనదేశంలో జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఫోర్బ్స్ - 2000 జాబితాలోని కంపెనీల్లో దాదాపు 285 కంపెనీలు ఇప్పటికే బెంగళూరులో జీసీసీలను ఏర్పాటు చేశాయని వెల్లడించింది. ఇటువంటి 100 కంపెనీల కేంద్రాలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 10 లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారని తెలిపింది. 2030 నాటికి మనదేశంలో కొత్తగా 620 జీసీసీ కేంద్రాలు ఏర్పాటవుతాయని అంచనా. దీనివల్ల ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాల సంఖ్య అనూహ్యంగా పెరగనుందని నివేదికలో వెల్లడించింది.
మధ్యస్థాయి కంపెనీలూ ముందుకు వస్తున్నాయ్
ఆసక్తికర విషయం ఏమిటంటే బహుళ జాతి కంపెనీలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాకుండా ఒక మోస్తరు, మధ్యస్థాయి కంపెనీలు కూడా సొంత జీసీసీలను ఏర్పాటు చేయడానికి చూస్తున్నాయి. ఇటువంటి కంపెనీలు సహజంగానే తక్కువ వ్యయాలతో కేంద్రాలు నిర్వహించే అవకాశం ఉన్న రెండో అంచె నగరాల వైపు మొగ్గుచూపుతాయి. అందువల్ల సమీప భవిష్యత్తులో ద్వితీయ శ్రేణి నగరాలు కూడా జీసీసీలకు కేంద్రాలు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నగరాల్లో అవకాశాలు
రెండో అంచె నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు విశాఖపట్నం, అహ్మదాబాద్, తిరువనంతపురం, భువనేశ్వర్, కోయంబత్తూర్ అత్యంత అనుకూలంగా ఉన్నట్లు ఏఎన్‌ఎస్‌ఆర్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. వీటిల్లోనూ విశాఖ అగ్రభాగాన నిలిచే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. పరిపాలన, ఐటీ, పరిశోధన- అభివృద్ధి, డేటా అనాలసిస్ తదితర కార్యకాలపాల నిర్వహణకు విదేశాల్లో ఏర్పాటు చేసే సమీకృత కేంద్రాన్ని జీసీసీలుగా వ్యవహరిస్తున్నారు. మనదేశంలో జీసీసీలను అమెరికా కంపెనీలు అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఐరోపా దేశాలకు చెందిన బహుళ జాతి కంపెనీలు ఉన్నాయి.
- ఐటీలో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగానికి చెందిన విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్ విభాగ సంస్థలు బెంగళూరులో అధికంగా జీసీసీలను నెలకొల్పేందుకు మొగ్గుచూపుతున్నాయి. విదేశీ ఫార్మా కంపెనీలు తమ జీసీసీలను హైదరాబాద్‌లో అధికంగా నెలకొల్పుతున్నాయి.
- ఈ తరహాలోనే ఐటీ, ఫార్మా జీసీసీలను ఆకర్షించేందుకు విశాఖపట్నానికి అవకాశం ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానిక పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.