తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట - 4 వారాల మధ్యంతర బెయిల్‌ - ALLU ARJUN GETS BAIL

అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట - మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం - ఆలస్యమైన విడుదల

PUSHPA 2 CASE IN HYDERABAD
ALLU ARJUN GETS BAIL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

Updated : 4 hours ago

Allu Arjun gets Bail : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించినా జైలు నుంచి విడుదల కాలేక పోయారు. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. బన్నీ వేసిన క్వాష్ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. సాయంత్రం 4 గంటల నుంచి సుమారు గంటన్నర పాటు ఇరువురు లాయర్లు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్​కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయి బెయిల్‌కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది.


అల్లు అర్జున్​ అరెస్ట్​తో ఇవాళంతా నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ వాదనల అనంతరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాసేపటికే హైకోర్టులో బన్నీకి బెయిల్ లభించింది.

ఏ11గా అల్లు అర్జున్​ : హైకోర్టులో అల్లు అర్జున్​ క్వాష్ పిటిషన్​పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్​ను ఏ11గా పేర్కొన్న పోలీసులు మధ్యాహ్నం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. క్వాష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టులో వాదించారు. ఇప్పటికే అరెస్టయినందున బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. అయితే క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

బెయిల్ ఇవ్వొద్దని పీపీ వాదనలు : పుష్ప-2 సినిమా విడుదలకు ముందు సంధ్య థియేటర్​లో బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగిందని... అయితే అల్లు అర్జున్ థియేటర్ మొదటి అంతస్తులో కూర్చున్నారని, తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి కింద అంతస్తులో ఉన్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ప్రేక్షకులు భారీగా తరలివచ్చినందున థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టుకు తెలిపారు. భారీగా జనం ఉంటారని తెలిసినప్పటికీ అల్లు అర్జున్ వెళ్లారని వివరించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని పీపీ వాదనలు వినిపించారు. క్వాష్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని, సోమవారం విచారించాలని కోరారు. సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్‌ను చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ ఇస్తు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

అల్లు అర్జున్​కు 14 రోజుల రిమాండ్ - చంచల్​గూడకు తరలింపు

అల్లు అర్జున్‌ అరెస్ట్ - పోలీసుల తీరును ఖండించిన నేతలు

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details