High Court Directed to CID Enquiry on JNTU Kakinada Registrar :అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంపై కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. కేసు నమోదు చేసి ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్ తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు జరిపి ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా 48 ఇంజినీరింగ్ కళాశాలలకు అటానమస్ హోదా కల్పించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇచ్చినా రాకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్‌పై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
High Court Orders CID Probe Against JNTU Kakinada Registrar Over NOC's To 48 Colleges :రిజిస్ట్రార్‌పై కేసులో దర్యాప్తు చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఉత్తర్వులు జారీ చేశారు. 48 ఇంజనీరింగ్ కళాశాలలు అటానమస్ హోదా పొందే విషయంలో జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసీ జారీ చేశారని అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, తదితర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ జోసఫ్ శ్రీహర్ష, మేరీ ఇంద్రజా ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కేవీకే రావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.