Heavy Rains in Nalgonda District Today :సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగెం- తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగు పోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 50మంది వరకూ ముంపు బాధితులను బోట్ల సాయంతో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందం కాపాడారు.
కొట్టుకొచ్చిన కారులో మృతదేహం :కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాహనాల్లోంచి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు అధికారులు సహాయ చర్యలు కాబట్టి క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కస్తూర్భా గాంధీ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించి సుమారు 180 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మఠంపల్లిలో భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాదాపు వంద మీటర్ల మేర పట్టాలు కుంగిపోయాయి.