తెలంగాణ

telangana

ETV Bharat / state

కమీషన్లకు ఆశపడి బోగస్​ కంపెనీలకు భారీగా జీఎస్టీ రీఫండ్​ - ప్రభుత్వ ఖజానాకు రూ.60కోట్ల గండి - GST Refund Scam in Telangana

GST Refund Scam in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ రీఫండ్‌ల ముసుగులో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొట్టారు. పన్నులు వసూలు చేయాల్సిన అధికారులే భక్షకులుగా మారారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే కమీషన్లకు కక్కుర్తిపడి జీఎస్టీ అనర్హులకు రీఫండ్‌లు ఇచ్చారు. చట్టంలోని వెసులుబాటులను ఆసరా చేసుకుని కోట్లాది రూపాయిలు దండుకున్న ఉదంతాలు బయట పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2022 జులై నుంచి 2023 నవంబరు వరకు జరిగిన కొన్ని రిఫండ్‌ అక్రమాలు ఉదంతాలపై "ఈటీవీ భారత్​" పరిశోధనాత్మక కథనం.

Electric Vehicles GST Scam in Hyd
GST Refund Scam in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 2:03 PM IST

Updated : Mar 18, 2024, 3:23 PM IST

కమీషన్లకు ఆశపడి బోగస్​ కంపెనీలకు భారీగా జీఎస్టీ రీఫండ్​ ప్రభుత్వ ఖజానాకు రూ60కోట్ల గండి

GST Refund Scam in Hyderabad :రాష్ట్రంలో ఈబైక్​ల తయారీ, టాల్కమ్​ పౌడర్​ ఉత్పత్తి సంస్థల మాటున కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సొమ్మును భారీగా జేబులో వేసుకున్నారు. నెల నెలా జీతం తీసుకున్న అధికారులు సైతం అక్రమార్కులతో చేతులు కలిపి కమీషన్లకు ఆశ పడి ఇష్టానుసారంగా రీఫండ్​లు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తంగా 14 డివిజన్లు ఉంటే ఈ రీఫండ్ల బాగోతం ఎక్కువగా హైదారాబాద్​లోని మాదాపూర్​ డివిజన్​ పరిధిలో చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్​ నుంచి కింది స్థాయి డీసీటీవో వరకు కమీషన్ల పంపకం జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా మేరకు మూడు నుంచి నాలుగు కేసుల్లో దాదాపు రూ.60కోట్లు ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం.

రీఫండ్​లకు ఎలా తెర లేపారంటే :విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ బైక్​ అమ్మకాలను ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం 5శాతం జీఎస్టీ మాత్రమే వాటిపై వేస్తోంది. దీన్నే ఆసరాగా చేసున్న పలువురు అక్రమార్కులు బోగస్​ సంస్థలు ఏర్పాటు చేశారు. వాటి తయారికి జీఎస్టీ లైసెన్స్​లు తీసుకున్నారు. కాగా ఈ లైసెన్స్‌లు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయకుండానే లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆ తరువాత ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయలేదు.

వ్యాపార సంస్థలు మూసేసినా లావాదేవీలన్నీ పేపర్‌పైనే - జీఎస్టీతో 40 కోట్లు నొక్కేశాడు

కంపెనీ కేవలం పేపర్​పైనే :అక్రమార్కులు బయట నుంచి ఈ బైక్​ విడిభాగాలు తీసుకొచ్చినట్లుగా, వాటి విలువపై 18శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్​ వాయిస్​లు సృష్టించి వాటిని అధికారిక వెబ్​సైట్లో అప్​లోడ్​ చేశారు. ఆ తరువాత విడిభాగాలను అసెంబుల్​ చేసి ఈ బైక్​లను విక్రయించినట్లు చూపించారు. ఈ బైక్​ల విలువపై 5శాతం జీఎస్టీతో అమ్మినట్లు బిల్లులు సృష్టించారు.

అయితే విడిభాగాల విలువపై చెల్లించిన 18శాతం జీఎస్టీలో ఈ బైక్​ల విలువపై వచ్చిన 5శాతం నగదును మినహాయించి మిగతా 13శాతం నగదును ప్రభుత్వ ఖజానా నుంచి రీఫండ్​ కింద తీసుకోవడాని కేంద్రం జీఎస్టీ చట్టంలో వెసులుబాటు కల్పించింది. దీన్నే ఆసరాగా తీసుకున్నారు అక్రమార్కులు.

కోటికి లక్షల్లో కమీషన్​ : డీలర్లు రీఫండ్​కు దరఖాస్తు చేసుకుంటే పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ఉంచింది. అదే విధంగా వాటికి అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖ కూడా నిర్దేశికాలు జారీ చేసింది. ఈ రెండింటిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తుదారు నివేదించిన వివరాలు కచ్చితమని నిర్ధారించుకున్న తరువాతనే రీఫండ్​లు మంజూరు చేయాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. కోటి రూపాయలు రీఫండ్​ ఇస్తే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కమీషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

డిస్టిలరీల నుంచి అనధికారిక మద్యం - రూ.వందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి!

నిజానికి వ్యాపారం చేసే డీలర్లు అయితే ఇంత కమీషన్లు ఇవ్వడానికి ముందుకురారు. కానీ ఇక్కడ రుపాయి పెట్టుబుడి పెట్టకుండా కాగితాలపై బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్న వ్యవహారమైనందున అధికారులు అడిగినంత కమీషన్​ ఇచ్చి మరీ మంజూరు చేయించుకున్నారు. ఈ వ్యవహారమంతా గత ప్రభుత్వ హయాం 2022 జూలై నుంచి నవంబరు 2023 వరకు కొనసాగిన అక్రమాలుగా "ఈటీవీ భారత్"​ పరిశోధనలో వెల్లడైంది.

మాదాపూర్‌ సర్కిల్‌ పరిధిలో ఓ అధికారిని 2022 నవంబరు నుంచి 2023 ఆగస్టు వరకు ఓ బోగస్‌ డీలర్‌కు రూ.14 కోట్లుకుపైగా రీఫండ్‌ ఇచ్చేశారు. అదే విధంగా మరో అధికారి 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఆగస్టు వరకు దాదాపు రూ.26 కోట్లు మరో బోగస్‌ డీలర్‌కు, ఇంకో అధికారి 2022 నవంబరు నుంచి గత ఏడాది ఆగస్టు వరకు ఇంకో బోగస్‌ డీలర్‌కు దాదాపు రూ.19 కోట్ల రీఫండ్‌లు ఇచ్చారు. ఈ ముగ్గురు అధికారులు కలిసి దాదాపు రూ.60 కోట్లు మేర అనర్హులకు ప్రభుత్వ సొమ్ము దోచి పెట్టారు. డీలర్ల నుంచి భారీ మొత్తంలో కమీషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కమీషన్​ ఇచ్చిన డీలరే అధికారిపై ఫిర్యాదు: అయితే ఇందులో మరో ట్విస్ట్‌ ఉంది. ఓ అధికారి ఇక్కడ నుంచి నల్గొండ డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఎక్కడ తన అవినీతి భాగోతం బయట పడుతుందోనన్న భయంతోపాటు తనకు రావాల్సిన కమీషన్లు వేరొకరికి పోతాయన్న భావనతో ఏకంగా ఆ డీలర్ చిరునామా తన పరిధిలోకి మారినట్లు చూపి రీఫండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఓఅధికారి చేసిన నిర్వాకం బయటకు పొక్కడం ఆ అధికారి ఓ డీలర్‌కు నోటీసు ఇచ్చి పిలిపించారు. ఆ డీలర్‌ రూ.65 లక్షలు చెల్లించగా మిగిలిన సొమ్ము తన ఆస్తులు అమ్మి చెల్లిస్తానని కొంత సమయం కావాలని కోరినా వినకుండా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జీఎస్టీ ఎగవేత కేసు - కావ్య మైనింగ్ ఎండీ, బిగ్‌ లీప్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్ అరెస్ట్

ఆ డీలర్‌ బెయిల్‌పై బయటకు వచ్చి ఈ అవినీతి భాగోతంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు బిల్లులు పెట్టి రీఫండ్‌ తీసుకున్నందుకు తాను ఆ మొత్తాలను చెల్లిస్తానని చెప్పినా వినకుండా తనను అరెస్టు చేశారని కానీ ఎందుకు తప్పుడు ఇన్‌ వాయిస్‌లు పెట్టి రీఫండ్‌ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడంతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అవినీతి వ్యవహారం బయటకు వచ్చింది.

దీంతో అప్రమత్తమైన ప్రస్తుత వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె. శ్రీదేవి అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈ బోగస్‌ సంస్థలకు ఇచ్చిన రీఫండ్‌లపై చర్యలకు ఉపక్రమించారని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరికి నోటీసులు ఇచ్చిన కమిషనర్‌ లోతైన అధ్యయనం చేయాలని సీనియర్‌ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తు పూర్తయితే కానీ వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదని ఆ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

రాష్ట్రంలో వ్యాట్‌ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం

Last Updated : Mar 18, 2024, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details