పుట్టిన ఊరి కోసం పట్టుబట్టి అభివృద్ది బాటన పెట్టిన గల్లా Galla Ramachandra Naidu Developed His Village : ఊరు అన్నాక బడి, గుడి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. పాఠశాల ఉంటే గ్రామంలోని చిన్నారులు చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించి దేశాభివృద్ధికి దోహదపడతారు. గుడి ఉంటే సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు అధ్యాత్మికత పెరిగి చిన్నారులు సన్మార్గంలో నడుస్తారు. ఇదే అంశాన్ని విశ్వసిస్తారు అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు. ఈయన చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామం పేటమిట్టలో జన్మించారు. పుట్టిన గ్రామానికి ఏదో చేయాలన్న తపన ఆయనది. అందుకే ఆ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు.
LKG నుంచి ఇంటర్ స్థాయి విద్యాబోధన వరకు అత్యంత ఆధునిక వసతులతో కూడిన విద్యాలయం నిర్మించారు. అక్కడ నామమాత్రపు ఫీజుతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5వేల మంది విద్యార్థులు ప్రస్తుతం పేటమిట్టలో చదువుతున్నారు. అక్కడే పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాధారణ పల్లెల్లో కనిపించని సహకార బ్యాంకు, స్టోర్‌లు ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు పూరిపాకలతో ఉండే పేటమిట్ట ఇప్పుడు పెద్దపెద్ద భవంతులతో నగరాన్ని తలపిస్తోంది.
Galla Ramachandra Naidu Funds to Village : సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గల్లా రామచంద్రనాయుడు ఉన్న ఊళ్లో కనీస వసతులు లేక గ్రామం నుంచి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న భావనతో నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా నుంచి తిరిగి వచ్చారు. 1983లో తిరుపతి సమీపంలోని కరకంబాడి ప్రాంతంలో అమరరాజ పరిశ్రమను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆయన పెరిగిన గ్రామం పేటమిట్టకు వెళ్లినపుడు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకునేవారు. మౌలిక వసతుల కొరత, విద్య, వైద్యం వంటి కనీస వసతుల గురించి ఆరా తీసేవారు.
ఆ క్రమంలోనే సొంతూరు అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడానికి వీలుగా 1997లో పరిశ్రమ ఏర్పాటు చేశారు. అయితే, తలుపులపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంగా ఉన్న పేటమిట్టను అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరమైన సమస్యలు వచ్చాయి. దీంతో ప్రభుత్వంతో చర్చించి పేటమిట్టను 2008లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో 5కిలోమీటర్లు అంతర్గత రహదారులు, రెండు కిలోమీటర్లు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వీధిదీపాలు, మంచి నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించారు. వైద్యం కోసం ప్రత్యేకంగా ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేశారు. గల్లా రామచంద్రనాయుడు పరిశ్రమ ఏర్పాటు తర్వాత పేటమిట్ట గ్రామ రూపురేఖలే మారిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు.
టీజీ వెంకటేశ్ జన్మదినం..రూ.1కోటీ 25 లక్షలతో పలు అబివృద్ధి పనులు
Galla Ramachandra Naidu Village : మౌలిక వసతుల కల్పనతో పాటు బ్యాంకు, పోస్టాఫీసుతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడానికి వీలుగా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను కూడా ఏర్పాటు చేయించారు. ఉన్నత విద్యనభ్యసించిన యువతకు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలు కొరవడటంతో వారి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఊళ్లో పుట్టినందుకు, దేవుడు ఎంతో కొంత ఇచ్చినందుకు దేవాలయ సముదాయం నిర్మించాలనే ఆలోచన కూడా ఆయనకు నిత్యం స్ఫురణకు వచ్చేది. గ్రామస్థుల్లోనూ అదే అభిప్రాయం ఉండటంతో రామచంద్ర నాయుడు వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. గ్రామదేవతగా పూజలందుకునే విరూపాక్షమ్మ ఆలయం ఓ చెట్టు కింద ఉండేది. అక్కడే అందరూ ఏటా విజయదశమి ఉత్సవాలు జరుపుకునేవారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే క్రమంలో విరుపాక్షమ్మ ఆలయ సమీపంలో దేవాలయ సముదాయన్ని కడితే భక్తి, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని కొనసాగించినట్టవుతుందని రామచంద్ర నాయుడు భావించారు. కొందరు గ్రామస్థులతో శ్రీ కోదండరామ దేవాలయ ట్రస్టు ఏర్పాటు చేశారు.
'దాదాపు ఎకరా విస్తీర్ణంలో ఒకే ఆవరణలో 12 కోట్ల రూపాయలతో శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలతో ప్రధాన ఆలయం, ఒకవైపు మహా గణపతి, మరోవైపు వేణుగోపాల స్వామి గుడి నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. 2019 జనవరిలో భూమిపూజ చేసి పనులు కూడా ప్రారంభించారు. పేటమిట్ట చిన్న ఊరు కావడం, పెద్దగా భూమి లేకపోవడంతో రామచంద్ర నాయుడే భూమి కొనుగోలు చేశారు. అమరరాజ సంస్థల ఛైర్మన్ హోదాలో రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన డబ్బు మొత్తాన్నీ దేవాలయ సముదాయం కోసం వెచ్చించారు. మేము కూడా మా వంతు సహకారం అందించారము.' -గ్రామస్థులు
తమిళనాడులోని మహాబలిపురం నుంచి నిపుణులైన శిల్పులను తీసుకొచ్చి కోదండ రాముడు, వినాయకుడు, వేణుగోపాలస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. కేరళ నుంచి ప్రత్యేక కలపతో కూడిన ధ్వజస్తంభాన్ని తెచ్చి ప్రతిష్టించారు. ఆలయాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలుగా మినీ ఓపెన్ ఆడిటోరియం, గుళ్లకు వచ్చే భక్తుల పిల్లలు ఆడుకునేందుకు పార్క్, గ్రామస్థులు చిన్న చిన్న వేడుకలు చేసుకునేందుకు సామాజిక భవనం నిర్మిస్తున్నారు.
ఎంత దూరంలో ఉన్నా మూలాలు మరచిపోవద్దు - అమ్మమ్మ ఊరిలో నెదర్లాండ్ క్రికెటర్ అనిల్ తేజ
Chittoor District Petamitta : దేవుళ్ల సన్నిధిలో వృద్ధులు సాయంత్రం ప్రశాంతంగా కూర్చునేందుకు, మహిళలు భజనలు, కోలాటాలాడేందుకు ఏర్పాట్లు చేశారు. దేవాలయాల నిర్మాణంతో గ్రామ వాతావరణమే మారిపోతుందని, భక్తిభావం పెరుగుతుందని పేటమిట్ట, సమీప గ్రామాల్లోని ప్రజలు భావిస్తున్నారు. ఈనెల 12 నుంచి 15 వరకు మహా ప్రతిష్ఠ- కుంబాభిషేక మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గ్రామాభివృద్ధి పరంగా లభించిన సంతృప్తికి తోడు ఆధ్మాత్మికతను పెంపొందించేందుకు శ్రీకోదండరామాలయ సముదాయం నిర్మించామని గ్రామస్థుల భాగస్వామ్యంతో ఆలయ నిర్మాణాలు పూర్తి చేశామని గల్లా రామచంద్రనాయుడు తెలిపారు.
గల్లా రామచంద్రనాయుడు సొంత గ్రామం కోసం చేస్తున్న కృషిని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ జరగాలంటే ఆయా గ్రామాల్లో స్థిరపడ్డ వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ నాయకులు ముందుకు రావాలి అప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.