BRS Niranjan Reddy fires on Congress :రైతులు ఎవరైనా రైతులేనని, ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలని, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్‌డేట్ కూడా నిర్ణయించకపోవడం ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేయడంతో, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
తెలంగాణలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉండగా, కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధిని గరిష్ఠంగా 36 లక్షల మంది రైతులకే అమలు చేశారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం విధించిన అనేక నిబంధనల మూలంగా, రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ నిధి రైతుల సంఖ్య 29,78,394 మంది కాగా ఇందులో 29,50, 888 మంది ఖాతాల్లో మాత్రమే ఈ విడతలో నగదు జమైందని ఆయన తెలిపారు.
ఎగ్గొట్టేందుకు రంగం సిద్దం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు ఏడాదికి 10 వేలు రైతుబంధు పథకాన్ని వర్తింపజేశారని నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశ, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 11 విడతల్లో రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో 72,910 కోట్లు జమచేశారని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రాతిపదికగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలను ఎగ్గొట్టేందుకు రంగం సిద్దం చేస్తోందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.