Effects of Heat Waves Have Been Felt Since March : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మహాశివరాత్రి తర్వాత వేడి, ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి రెండు లేదా మూడో వారంలోనే రాష్ట్రంపై వడగాలులు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది.
ముచ్చెమటలే
- 1961 నుంచి 2020 మధ్యకాలంలో సేకరించిన వివరాల ప్రకారం మార్చి-జూన్ మధ్యలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది.
- నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి.
- వాతావరణ మార్పుల ప్రభావంతో గత 30 ఏళ్లలో వడగాలుల వ్యవధి 2.5 రోజులు పెరిగింది.
- 2015లో విపత్తు మాదిరిగా వడగాలులు విజృంభించాయి. ఆ ఏడాది మే 23 నుంచి 27 మధ్యకాలంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం నెలకొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 2-3 రోజుల వ్యవధిలోనే 7 నుంచి 10 డిగ్రీలు పెరిగాయి.
- వడగాలులు సాధారణంగా 4 నుంచి 8 రోజులుంటాయి. కోస్తాంధ్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఆ వ్యవధి 8 రోజుల కంటే ఎక్కువే.