మధుర జ్ఞాపకాలు మనసు నిండా ఉండేలా - 'సిగ్నేచర్ డే' సెలబ్రేషన్స్ (ETV Bharat) Signature Day Celebration in Aurora College : టీషర్ట్స్‌పై సంతకాలు చేస్తూ సందడి చేసున్న వీరంతా హైదరాబాద్ చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. కాలేజీ చదువుకు ఆఖరి రోజు కావడంతో సుమారు 200 మంది విద్యార్థినీ విద్యార్థులంతా ఒకచోట చేరి ఇలా ఉత్సాహంగా సందడి చేశారు. అరోరా కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థినీ విద్యార్థులు సిగ్నేచర్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు.
కొంటె కొటేషన్లతో ఒకరిపై ఒకరు :తమ మిత్రుల ఫోటోలను ముద్రించిన టీషర్ట్స్ ధరించి, అనుభూతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. స్నేహానికి గుర్తుగా గడిపిన జ్ఞాపకాలను పదిలపర్చుకుంటూ కళాశాల ప్రాంగణంలో హుషారుగా గడిపారు. టీషర్ట్స్‌పై ఒకరికొకరు సంతకాలు, కొటేషన్స్, అభిప్రాయాలను రాస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు ఈ విద్యార్థులు. లేట్ కమర్ అని ఒకరు, రేర్ క్యాండిడేట్ అని మరొకరు, కచ్చా కార్తీక్ అని ఇంకొకరు, ఇలా రకరకాల కామెంట్లు, కొంటె కొటేషన్లతో ఒకరిపై ఒకరు తమ స్నేహాన్ని చాటుకున్నారు ఈ విద్యార్థులు.
కల్మషం లేని స్నేహం : కళాశాలలో చదువు ఒక భాగమైతే ఇక్కడ దొరికే స్నేహం ఎంతో విలువైనదంటోన్న విద్యార్థులు, తమ టీషర్ట్స్‌ను పదిలంగా దాచుకుంటామని చెబుతున్నారు. మూడు సంవత్సరాలు కళాశాలలో కలిసి చదువుకున్నారు. ఎన్నో విశేషాలు తెలుసుకున్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు భాగస్వామ్యం అయ్యారు. ఏ కల్మషం లేకుండా సాగిన తమ ఈ ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పిందిందని, అందుకే సిగ్నేచర్ డే చివరి రోజునూ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని అంటున్నారు విద్యార్థులు.
టైంపాస్ చేస్తూ గడిపే స్నేహం కంటే సలహాలు, సూచనలతో కూడిన స్నేహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుకే కళాశాలల్లో ఈ సిగ్నేచర్ డే ట్రెండ్‌గా మారుతోంది. విద్యను ముగించుకొని జీవితంలో మరో కొత్త పేజీని తెరబోతున్న విద్యార్థినీ విద్యార్థుల్లో నయా జోష్ నింపుతోంది.
'కాలేజీలో ఇవాళ మాకు లాస్ట్డే. చాలా ఎంజాయ్‌గా ఉన్నాం. మూడేళ్ల నుంచి మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. మా కాలేజీ ఫ్యాకల్టీ వల్ల సిగ్నేచర్ డే జరుపుకుంటున్నాం. గడిచిన మూడేళ్లలో చాలా నేర్చుకున్నాం. కాలేజీకి వచ్చిన కొత్తలో ఎవరికి ఎవరూ తెలియదు. కానీ వెళ్లేటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా టీ షర్ట్‌పై మా ఫ్రెండ్స్ సిగ్నేచర్స్ బెస్ట్ మెమరీగా ఉంటుంది'-విద్యార్థినీ విద్యార్థులు