Crops Submerged Flood Effect in Joint Guntur District: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొర్లుతున్నాయి. పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి వరి పైర్లు నీట మునిగాయి. గుంటూరు బస్టాండ్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు సైతం సహయక చర్యలు చేపడుతూ అందుబాటులో ఉంటున్నారు. కృష్ణానది నుంచి భారీగా వరద ప్రవాహిస్తోంది.
నీట మునిగిన వరి పైర్లు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని కొత్త కాలనీలో భారీగా వరద నీరు చేరి వరి పైర్లు నీట మునిగాయి. పొలాల్లోని వరద నీరు రహదారిపైకి చేరింది. దీంతో గుంటూరు, వట్టిచెరుకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల మధ్యకు భారీగా చేరిన వర్షపు నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కాకుమాను మండలం కొండపాటూరు వద్ద నల్లమడ వాగు కట్టపై నుంచి నీరు పొలాల్లోకి ప్రవహిస్తుంది. గతంలో వాగు కట్టకు పడిన గండిని డ్రైనేజీ అధికారులు పూడ్చలేదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల గండి పెద్దదయ్యే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. కొల్లిమర్ల వద్ద నక్క వాగు ఉద్ధృతికి అన్నదాతల పొలాలు నీట మునిగాయి. పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో వరి సాగు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో నీటమునిగిన పంటలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పరిశీలించారు.
బస్టాండ్‌లో మునిగిన 130 బస్సులు: గుంటూరులో భారీ వర్షానికి బస్టాండ్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. 130 బస్సులు నీట మునిగాయి. గుంటూరు నుంచి జిల్లా నలుమూలలకు బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్‌లో 4 అడుగుల మేర వరద నీరు నిలిచింది. ప్రయాణికుల సౌకర్యార్థం పల్నాడు, తెనాలి, అమరావతి రోడ్డులో నుంచి కొన్ని బస్సులు నడుపుతున్నారు. పలు చోట్లకు 70 బస్సు సర్వీసులను అధికారులు నడుపుతున్నారు. బస్టాండ్‌లో నిలిచిన నీటిని రాత్రి నుంచి 3 మోటార్లతో తోడుతున్నారు. రేపటికి వరదనీరు తోడి బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
గుంటూరు శివారు కాలనీలను వరద ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో ప్రగతి నగర్ సహా మిగిలిన కాలనీల్లో పరిస్థితిని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా వరకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నవారికి భోజన సదుపాయం కల్పించారు.
కృష్ణా నది నక్కపాయకు గండి : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారధి సమీపంలో కృష్ణా నది నక్కపాయకు గండి పడింది. సమీపంలోని పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. గతంలో గండి పడినచోట మట్టి, ఇసుక బస్తాలతో పూడ్చారు. ఆ ప్రాంతంలోనే భారీ వరద రావడంతో మళ్లీ గండి పడింది. ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ ధాటికి నక్కపాయకు గండి పడటంతో కొల్లూరు నుంచి లంక గ్రామాలకు వెళ్లే రోడ్డు మూసుకుపోయింది. పెదలంక, అవుల్లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది.
తాడేపల్లిలో పర్యటించిన మంత్రి లోకేశ్: భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతం, ముంపు బారిన పడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లలో చేరిన నీటిని వీలైనంత త్వరగా తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతోందా అని బాధితులను అడిగారు. అధికారులు దగ్గరుండి అన్నిరకాల సహకారం అందిస్తున్నట్లు బాధితులు లోకేశ్‌కు చెప్పారు.
మంత్రి లోకేశ్ పరామర్శ: మంగళగిరిలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతి చెందిన నాగరత్నమ్మ కుటుంబాన్ని మంత్రి లోకేశ్ పరామర్శించారు. ప్రభుత్వ ప్రకటించన ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబసభ్యులకు అందింజేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, స్థానిక నాయకులతో కలిసి కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. కృష్ణలంకల్లో ఉంటున్న నాలుగు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
పల్నాడు జిల్లా రామాపురంలో రెడ్ అలర్ట్ : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కృష్ణానది వరదతో చేపల కాలనీ పూర్తిగా నీటమునిగింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది తీరాన ఉన్న మత్స్యకారుల కాలనీలోకి భారీగా నీరు చేరింది. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మత్స్యకారులు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు పయనమయ్యారు. క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. మాచర్ల క్రాస్ రోడ్ వద్దనున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నీటమునిగింది. ఆలయంలో ధూప, దీప నైవేద్యాలు పెట్టేందుకు కూడా చోటు లేకుండా పోయిందని ఆలయ పూజారి భాస్కర్ శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పులిచింతల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల: పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 16 వేల క్యూసెక్కులు నీరు మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జారీ పడిన కొండచరియలు: పల్నాడు జిల్లాలో కొండవీడు కోటపైకి వెళ్లే ఘాట్ రోడ్లో కొండచరియలు నాలుగైదు చోట్ల జారి పడటంతో అటవీ శాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఘాట్ రోడ్డులో పెద్ద పెద్ద రాళ్లు జారి పడిపోవడంతో పూర్తిగా రహదారి మూసుకుపోయింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్పటివరకు రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పర్యాటకులు ఎవరు కొండవీడు కోటపైకి రావద్దని సూచించారు.
ఉమ్మడి గుంటూరును ముంచెత్తిన వరద - మునిగిన 130 ఆర్టీసీ బస్సులు (ETV Bharat)