HCL Tech New Campus : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము ప్రతి రోజూ బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో, పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో, గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందని అన్నారు. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నామన్నారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. తమ దగ్గర అత్యధిక ఏఐ, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయని చెప్పారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తామని ముందు చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరు అన్నారని పేర్కొన్నారు.
రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరన్నారు. తమ పోటీ ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని తాను చెప్పినప్పుడు కొంత మంది అది పెద్ద కలనే అవుతుందని ఎద్దేవా చేశారన్నారు. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాక, రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.