Boats Removal in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతం అయింది. ఎనిమిదో రోజు 40 టన్నుల భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత ఏడు రోజులుగా ఇంజినీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్ల తొలగింపు ప్రక్రియలో పురోగతి ఇంజినీర్లు పురోగతి సాధించారు.
2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి బోటును బయటకు లాగారు. నాలుగు భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పడవలతో లాగడంతో బోటు దిశలో వచ్చింది. అదే విధంగా తొలుత 30 మీటర్ల మేర ముందుకు కదిలింది. అనంతరం బ్యారేజీ గేటు నుంచి అర కిలోమీటర్ మేర నదిలోకి లాక్కెళ్లారు. అక్కడ నుంచి ఇంజినీర్లు, అధికారులు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రక్రియలో తొలత పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపారు. నీట మునిగిన పడవను పైకి తీసుకొచ్చారు. నది అడుగు నుంచి 10 అడుగులపైకి తీసుకొచ్చి, బ్యారేజ్ గేటు నుంచి ఒడ్డుకు చేర్చారు.
తొలుత పలు ప్లాన్లను ట్రై చేసిన అనంతరం, సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు. ఇంకా బ్యారేజీ వద్ద 2 భారీ, ఒక మోస్తరు బోటు అడ్డుపడి చిక్కుకుని ఉన్నాయి. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను బెకెం సంస్థ ఇంజినీర్లు కొనసాగించనున్నారు.
ఇసుక, నీరు బోటులోకి చేరికతో 100 టన్నులకు బోటు బరువు పెరిగింది. బోటు బరువు భారీగా ఉండటంతో సరికొత్త విధానం అమలు చేసిన అధికారులు, రెండు బోట్లకు అదనంగా మరో 2 బోట్లను అనుసందానించారు. ఈ విధంగా పడవను లాగుతూ ఒడ్డుకు తేవడంలో అధికారులు విజయవంతమయ్యారు.