Bhadradri Water level Increased Due To Heavy Rain Fall :రాష్ట్రంలో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం మధ్యాహ్నానికి 34 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు, కాళేశ్వరం, సమ్మక్క సారక్క బ్యారేజీల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరిగిన వరద భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వచ్చి వరద నీరు చేరుతుంది. ఈరోజు ఉదయం 21 గేట్లు ఎత్తి లక్షా 4834 క్యూసెక్కుల వరద నీటిని దిగువన గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. ఇదే మండలంలోని లింగాపురం పాడు గ్రామ సమీపంలోని చెరువు కట్టపై నుంచి వరద నీరు పారుతున్నాయి. గతవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువు మొత్తం నిండిపోయి ఈరోజు ఉదయం కట్ట నిండి పై నుంచి ప్రవహిస్తోంది. ఫలితంగా లింగాపురం పాడు వద్ద గల ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో కొత్తపల్లి లింగాపురం కొంపల్లి కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దుమ్ముగూడెం మండలం కె.లక్ష్మీపురం, గౌరారం గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం నీట మునిగి సీతవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గుబ్బల మంగి వాగు వేగంగా ప్రవహించటంతో వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది.