APJAC Chalo Vijayawada Protest Postponed: అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు (Bandi Srinivasa Rao) తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 27న జరగాల్సిన ‘చలో విజయవాడ’ను వాయిదా వేస్తున్నట్లు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్క డిమాండ్‌పైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా చలో విజయవాడను వాయిదా వేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీజేఏసీ తరఫున ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సమయంలోనే ‘మాకు నమ్మకం లేదు దొర’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల కోడ్‌తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు
ఒక్క డిమాండ్‌పైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా మినిట్స్‌లో పెట్టినందుకు ‘చలో విజయవాడ’ను వాయిదా వేస్తున్నట్లు బండి శ్రీనివాసరావు ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని యూటీఎఫ్ (United Teachers Federation), ఏపీటీఎఫ్ ఖండించాయి. వీటితో పాటు ఏపీజేఏసీలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తూతూమంత్రంగా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి వాయిదా వేశారని విమర్శిస్తున్నాయి.
ముందే సమాచారం: ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉండదని ఏపీజేఏసీ కీలక నేత మంత్రివర్గ ఉప సంఘం చర్చలకు ముందే తనకు సన్నిహితంగా ఉండే నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. 'చలో విజయవాడ' కార్యక్రమం అనుమతి కోసం సీపీ కాంతిరాణా టాటాని కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని, కనీసం లేఖనే ఇవ్వలేదని చెబుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను సైతం జిల్లాలకు పంపలేదని తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుతో శనివారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడైన బండి శ్రీనివాసరావు ఈ నెలలో పదవీవిరమణ చేయనున్నారు.
డిమాండ్లు పరిష్కరించని ఏ ప్రభుత్వమూ తిరిగి అధికారంలోకి రాలేదు: ప్రభుత్వ ఉద్యోగులు
కేవలం 250 కోట్ల రూపాయలనే ప్రభుత్వం చెల్లించింది:ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21 వేల కోట్లు ఉంటే కేవలం 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటి వరకు 12వ పీఆర్సీ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోగా, 9 మంది సభ్యులను ఇప్పుడు నియమించింది. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. మధ్యంతర భృతి ఇవ్వకుండా జులైలో పీఆర్సీ ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటినుంచో చెప్తూ వస్తోంది. సెప్టెంబరు 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ అమలు చేస్తామని చర్చల్లో చెబుతున్నా అమలు మాత్రం చేయడం లేదు. గతంలో పెన్షనర్లకు ఉన్న అదనపు క్వాంటం పెన్షన్‌ను సైతం పీఆర్సీ సమయంలో జగన్ ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు దాన్ని ఇస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్పింది.
వీటిపై ప్రభుత్వం మినిట్స్ ఇవ్వడంతో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీజేఏసీ ప్రకటించింది. ఏ ఒక్క సమస్యకూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోయినా మధ్యలోనే ఉద్యమాన్ని వదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మరణించిన ఎయిడెడ్, స్థానిక సంస్థలకు చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఎంతో కాలంగా ఉద్యోగులు కోరుతున్నారు. కానీ, డేటాని సేకరిస్తున్నామని మాత్రమే మినిట్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు మరో 15 రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికీ డేటా సేకరిస్తుంటే ఏం ప్రయోజనం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల బకాయిలు- చర్చలు నిరుత్సాహపరిచాయి, ఉద్యమం కొనసాగుతుంది: ఉద్యోగ సంఘాలు