AP State Budget 2025: సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూల ధనవ్యయం పెంచే విధంగా బడ్జెట్‌నూ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారని సమాచారం. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల అసెంబ్లీలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూ.3.20 లక్షల కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బేటీ కానుంది. అనంతరం 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక బడ్జెట్ అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందుంచనున్నారు.
శాసన మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. 2025 ఏప్రిల్ 1 తేదీ నుంచి మొదలయ్యే ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ.3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 2025-26 ఆర్ధిక సంవత్సరంలో తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్ధిక సాయంగా అన్నదాత సుఖీభవ, అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.