AP Fibernet Corporation Sends Notice To Director RGV :సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆయనకు నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్‌నెట్ నుంచి కోటీ 15 లక్షల రూపాయల మేర అనుచితంగా లబ్ధి పొందడంపై రామ్‌గోపాల్‌వర్మకు లీగల్ నోటీస్ జారీచేశారు. ఈ మేరకు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకు వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా రామ్‌గోపాల్‌వర్మతో ఒప్పందం చేసుకున్నారని జి.వి.రెడ్డి పేర్కొన్నారు. సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు 11 వేల రూపాయల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని జి.వి.రెడ్డి వెల్లడించారు.
అరెస్టు చేస్తే జైల్లో నాలుగు సినిమా కథలు రాసుకుంటా: రాంగోపాల్ వర్మ
ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చెల్లింపులపై ప్రస్తుత ఛైర్మన్ జి.వి.రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు కేబుల్, ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా 2016లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL)ను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారని జీవీ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 2019లో 24 వేల కి.మీ. కేబుల్ వేసి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ల సంఖ్య 5 లక్షలకు పడిపోయి, సంస్థ ప్రస్తుతం దివాళా అంచున ఉందని వివరించారు. గత ప్రభుత్వ తీరువల్లే దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్న ఆయన సంస్థలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.