AP Deputy CM Pawan Kalyan Hot Comments ON Law And Order :ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేయలేదని, అందుకే ఆ పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామని పవన్‌కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మరీ మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
క్రిమినల్‌కు కులం, మతం ఉండవు :గత ఐదేళ్లలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి కనీసం మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు ఎలా వారసత్వంగా వచ్చాయో, గత ప్రభుత్వ తప్పిదాలూ సైతం ఇప్పుడు అలానే వచ్చాయన్నారు. అప్పుడు చేసిన నేరాలు, అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలు బలంగా అమలు చేయాలని పదేపదే తాను చెప్పానని, శాంతిభద్రతల పరిరక్షణ అనే అలవాటు అధికారులకు తప్పిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటా : పవన్‌కల్యాణ్ (ETV Bharat) గత ప్రభుత్వంలో పోలీసులు, అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారన్న డిప్యూటీ సీఎం, ఇవాళ ధర్మబద్ధంగా చేయాలని ప్రాధేయపడుతున్నా మీన మేషాలు లెక్కిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసు అధికారులు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండవన్న ఆయన, ఈ విషయం పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలని ప్రశ్నించారు. ఒకర్ని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందట, మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? అంటూ నిట్టూర్చారు.
కూటమి ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే
పోలీసు ఉన్నతాధికారులు చదువుకుంది ఐపీఎస్ కాదా? భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) మీకేం చెబుతోందంటూ ప్రశ్నించారు. క్రిమినల్స్‌ను వెనకేసుకు రావాలని శిక్షాస్మృతి ఏమైనా చెబుతోందా అన్న పవన కల్యాణ్, విషయాన్ని తెగేదాకా లాగొద్దని సూచించారు. ఈ కూటమి ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉందన్నారు. అధికారంలో ఉన్నందునే సంయమనం పాటిస్తున్నామని, ప్రజల ఆవేదనను ఇలా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానంటూ వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు కూడా చెబుతున్నా, ఉన్నతాధికారులు పదేపదే మాతో చెప్పించుకోవద్దని హెచ్చరించారు.
అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటా : తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండంటూ తీవ్రంగా మాట్లాడారు. తాను ఎవరినీ వెనకేసుకుని రావడం లేదని, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అనిత, తన శాఖ విషయంలో బాధ్యత తీసుకోవాలని పవన్ సూచించారు. తాను హోంశాఖ బాధ్యతలు తీసుకుని ఉంటే, పరిస్థితులు వేరుగా ఉంటాయని నేరస్తులను హెచ్చరించారు. తమను విమర్శించే నాయకులనుద్దేశించి మాట్లాడిన ఆయన, ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండంటూ హితవు పలికారు. లేకుంటే తాను హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుందని.. గుర్తుపెట్టుకోండంటూ మాట్లాడారు. ఇంత మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకు ఉండటమని మండిపడ్డారు. మరోవైపు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికన్న ఆయన, నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? అంటూ నిలదీశారు. తాను అడగలేక కాదని, తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయని తెలిపారు.
"యూపీలో ఆదిత్యనాథ్ చేసినట్లు క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోవాలి. ఆడబిడ్డల మాన ప్రాణసంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. గత ప్రభుత్వం మాదిరిగా పోలీసు శాఖ ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావప్రకటన స్వేచ్ఛ అంటే అప్పుడున్న అధికారులే కదా ఇప్పుడున్నది. పవన్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ముందున్నారు, ఒక క్రిమినల్‌ను అరెస్టు చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు."-పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి
'అయ్యా పవన్ కల్యాణ్ సార్ - మీరే మాకు న్యాయం చేయాలి - మీ ఒక్కరి వల్లే అవుతుంది'