ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రూప్‌ 1 మూల్యాంకనంలో అక్రమాలు' - విచారణకు అభ్యర్థుల డిమాండ్ - APPSC IRREGULARITIES IN 2018

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 నియామకాలు - అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలంటున్న అభ్యర్థులు

2018 Group-1 Evaluation Issue
2018 Group-1 Evaluation Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 2:41 PM IST

Candidates Demands Inquiry on APPSC to Group-1 (2018) Mains Exam :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 (2018) నియామకాల అవకతవకలపై విచారణ జరిపించాలని నిరుద్యోగులు చేస్తున్నారు. ఈ నియామకాల్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. గతంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్ (Gautam Sawang), కార్యదర్శి సీతారామాంజనేయులు (Sitaramanjaneyulu)కు ఉన్న ఐపీఎస్‌ పదవి నుంచి తప్పించాలని, వారు కళంకితులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2018 Group-1 Evaluation Issue :ప్రస్తుతం ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచింది, అయినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. జగన్‌ మోహన్ రెడ్డి సర్కారు హయాంలో చేపట్టిన ఏపీపీఎస్సీ గ్రూపు-1 (2018) నియామకాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. జవాబు పత్రాల మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదని, మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఈ సంవత్సరం మార్చి 13న ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిట్‌ అప్పీళ్ల ద్వారా షరతులతో నియామక ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, అక్రమాల గుట్టు మాత్రం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఇటీవలి శాసన సభ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు నిజమే - విచారణ జరిపిస్తాం: పయ్యావుల కేశవ్‌ - CBI Investigation on Group 1 Posts

గ్రూప్‌-1 మూల్యాంకనాల ఆ తీరే వేరు :గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 ఏడాది డిసెంబరు 31న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది. 2019 మే లో ప్రిలిమ్స్, 2020 డిసెంబరులో మొయిన్ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనం నుంచే అక్రమాల పరంపర మొదలైంది. నోటిఫికేషన్‌లో పేర్కొనకుండా డిజిటల్‌ వాల్యుయేషన్‌ ద్వారా జవాబు పత్రాలను దిద్దించడాన్ని పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆ నిర్ణయాన్ని ధర్మాసనం కూడా తప్పుపట్టింది. మాన్యువల్‌గా జవాబు పత్రాలను దిద్దించాలని ఆదేశించాలని జారీ చేసింది.

దీనికి అనుగుణంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు (Sitaramanjaneyulu) ఆధ్వర్యంలో 2021 డిసెంబరు 5 నుంచి ఫిబ్రవరి 20 వరకు జవాబు పత్రాలను దిద్దించారు. ఆ ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ మరోసారి మూల్యాంకనం చేయించారని, ఈ సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరగలేదని కమిషన్‌ వాదనలు వినిపిస్తోంది. మొత్తంగా మూల్యాంకనానికి కమిషన్‌ అన్ని స్థాయిల్లో సుమారు 2 కోట్ల రూపాయల వరకు చెల్లించింది.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మూడు కేంద్రాల్లో 2022 మార్చి 25 నుంచి మే 25 వరకు సంప్రదాయ మూల్యాంకనం చేశారు. ఈ సమయంలోనే కమిషన్‌ అదనపు కార్యదర్శి 3,34,720 రూపాయల మొత్తాన్ని డేటాటెక్‌కు చెల్లించారు. దీనికంటే హాయ్‌ల్యాండ్‌లో చేయించిన మూల్యాంకన ఖర్చే అధికంగా ఉంది. జవాబు పత్రాల్లో 2 రకాల చేతి రాతలు ఉన్నట్లు ఏపీపీఎస్సీనే వెల్లడించింది. మలి విడత మూల్యాంకనం ప్రారంభం కాకముందే నిపుణుల వివరాలు సబ్జెక్టుల వారీగా ఫోన్‌ నంబర్లతో సహా బయటకు వచ్చాయి. డిజిటల్‌ వాల్యుయేషన్‌ (Digital Valuation )ద్వారా మౌఖిక పరీక్షకు ఎంపికైన వారిలో సుమారు 60 శాతం మంది సంప్రదాయ మూల్యాంకన ఫలితాల్లో వెనకబడ్డారని అభ్యర్థులు అంటున్నారు.

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రద్దుతో కళంకం- నిమ్మకునీరెత్తినట్లు జగన్ సర్కార్!

ప్రభుత్వాన్ని కోరుతున్న అభ్యర్థులు :జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, ప్రధాన పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు ఈ సంవత్సరం మార్చి రెండో వారంలో తీర్పు వెలువరించింది. దీనిపై కమిషన్‌ డివిజన్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌ చేసింది. ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితులపై ప్రభుత్వం పునః సమీక్ష చేయాలని, అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరో వైపు ఈ వివాదానికి సంబంధించి కమిషన్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదికి కోట్ల రూపాయల్లో చెల్లింపులు చేసేందుకు బిల్లులు సిద్ధం అయ్యాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పటికే చెల్లించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కమిషన్‌ కార్యాలయంలో వైఎస్సార్సీపీ సంబంధించిన సభ్యులే :వైఎస్సార్సీపీ ప్రభుత్వం కమిషన్‌ కార్యాలయాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. వైఎస్సార్సీపీతో సంబంధాలు ఉన్న వారినే సభ్యులుగా నియమించుకున్నారు. వారిలో కొందరు గ్రూప్‌-1 ఉద్యోగాల ఎంపికలో పలువురి అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి గౌతం సవాంగ్‌ రాజీనామా చేశారు. ప్రస్తుతం విశ్రాంత ఐపీఎస్‌ అధికారిణి అనురాధ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. కమిషన్‌ సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులు అయిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. (APPSC)ఏపీపీఎస్సీపై నిరుద్యోగులకు తిరిగి విశ్వాసం పునరుద్ధరించాలంటే ప్రభుత్వం గ్రూప్‌-1 (2018) ప్రక్రియపై పటిష్ఠ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

2018 గ్రూప్-1 రద్దుపై హైకోర్టు స్టే - HC Stay on Group 1 Cancellation

ABOUT THE AUTHOR

...view details