SA vs BAN T20 World Cup 2024 :టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య సోమవారం (జూన్ 10) థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా నడిచిన ఈ పోరులో స్వల్ప స్కోరును కాపాడుకుని బంగ్లాపై కేవలం 4 పరుగుల తేడాతో సఫారీలు విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో తీసుకున్న ఓ డీఆర్‌ఎస్ నిర్ణయం ఇప్పుడు పలువురి నోట చర్చకు దారితీసింది. దాని వల్ల బంగ్లా జట్టు ఓ బౌండరీని కోల్పోగా, సరిగ్గా అదే నాలుగు పరుగుల తేడాతోనే సాతాఫ్రికా విజయం దక్కించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?
సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా టీమ్ ఒకానొక దశలో బలంగానే కనిపించినప్పటికీ చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టుకు 27 పరుగులు కావాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 17వ ఓవర్‌లో సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ వేసిన రెండో బంతి బంగ్లా ప్లేయర్ మహ్మదుల్లా ప్యాడ్స్‌ను తాకి స్టంప్స్ వెనుక నుంచి బౌండరీ వైపుకు వెళ్లింది.
సౌతాఫ్రికా జట్టు ఎల్బీకి అప్పీల్ చేయడం వల్ల వాళ్లను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లా డీఆర్ఎస్కు వెళ్లడంతో నాటౌట్ అని తేలిపోయింది. అయితే, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకునే సమయానికి ఆ బంతి డెడ్‌బాల్‌గా పరిగణించడం వల్ల ఐసీసీ రూల్స్ ప్రకారం బంగ్లాదేశ్ స్కోరుకు ఆ బౌండరీని కలపలేదు. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడా వల్ల ఆ జట్టు ఓడినందున ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్ నిర్ణయం సర్వత్ర చర్చనీయాశంగా మారింది.