KL Rahul Role In Team : జనవరి 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు భారత్, ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన టీమ్ఇండియా- ఇందులో కీలక ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్ స్థానంపై వివరణ ఇచ్చింది. ఈ సిరీస్‌లో రాహుల్‌ను వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి పక్కకు పెడుతున్నట్లు జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. రాహుల్ స్థానంలో అందుబాటులో ఉన్న కేఎస్ భరత్, ధృవ్ జురెల్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిస్థితుల ఆధారంగా వీరిద్దరిలో ఒకరికి వికెట్ కీపింగ్ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం టీమ్ ప్లేయర్ల ప్రాక్టీస్ అనంతరం నిర్వహించిన ప్రీ-మ్యాచ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. ఇక ఈ ప్రకటనతో స్పెషలిస్ట్‌గా బ్యాటర్‌గా టీమ్‌లో కొనసాగనున్నాడు కేఎల్.
"స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో మేము ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్నాం. రాహుల్ స్థానంలో మరో ఇద్దరు ప్లేయర్స్‌ను సెలెక్ట్ చేశాం. వీరిలో ఒకరు మొదటి రెండు టెస్టులకు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు."
- రాహుల్ ద్రవిడ్, హెడ్ కోచ్
'కేఎల్ అద్భుతంగా ఆడాడు- కానీ'
'డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సిరీస్ డ్రా కావడంలో ఇతడిది కీలక పాత్ర. ఈ 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్‌తో పాటు నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతడ్ని(కేఎల్ రాహుల్‌ను) వికెట్ కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉంచాలని సెలక్టర్లు నిర్ణయించారు' అని రాహుల్ అన్నారు.