Womens World Cup AI Tool :మహిళా క్రికెటర్ల భద్రత కోసం ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అభ్యంతరమైన, ద్వేషపూరితమైన కంటెంట్ నుంచి మహిళా క్రికెటర్లను రక్షించేందుకు సరికొత్త ఏఐ (AI Tool) టూల్‌ను ప్రారంభించింది. సోషల్ మీడియాలో క్రికెటర్లకు అభ్యంతరకరమైన కంటెంట్ నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో సోషల్ మీడియా మోడరేషన్ ప్రోగ్రామ్‌ను గురువారం ప్రకటించింది. మహిళల టీ20 వరల్డ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
60 మంది క్రికెటర్లు సైన్ అప్
60 మంది మహిళా క్రికెటర్లు ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేసుకున్నారు. దీంతో వారి సోషల్ మీడియా ఖాతాల్లోకి ఎటువంటి ద్వేషపూరితమైన కంటెంట్ రాకుండా ఏఐ టూల్ అడ్డుకుంటుంది. ఐసీసీ టీ20 మహిళ టీ20 వరల్డ్ కప్‌నకు ముందు ఉమెన్స్ ప్లేయర్లకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించేందుకు ఐసీసీ ఈ చొరవ తీసుకుంది. ఈ సోషల్ మీడియా మోడరేషన్ ప్రోగ్రామ్ ఏఐ సాంకేతిక అధారంగా నడుస్తుంది. గోబబ్బుల్తో కలిసి ఈ టూల్‌ను ఐసీసీ తీసుకొచ్చింది.
'కామెంట్లు ఇన్ యాక్టివ్'
ఐసీసీ అధికారిక ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్ సహా ఆటగాళ్ల వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చే కామెంట్లను పర్యవేక్షిస్తుంది. ప్లేయర్ల సోషల్ మీడియా ఖాతాల్లో అభ్యంతరకర, ద్వేషపూరిత కంటెంట్, వేధింపులకు సంబంధించిన కామెంట్లు ఉంటే వాటిని ఇన్ యాక్టివ్ చేస్తుంది. కాగా, ఈ టూల్ పై ఐసీసీ డిజిటల్ హెడ్ ఫిన్ బ్రాడ్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టూల్ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే ప్లేయర్లకు సానుకూల వాతావరణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.