Nirjala Ekadashi Vratam :తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి 17వ తేదీ తెల్లవారుఝామున 4:47 నిమిషాలకు ప్రారంభమై 18వ తేదీ ఉదయం 6:24 వరకు కొనసాగుతుంది. జూన్ 18వ తేదీన నిర్జల ఏకాదశిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
నిర్జల ఏకాదశి- పౌరాణిక గాథ
నిర్జల ఏకాదశి వెనుక ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. పాండవులలో రెండవ వాడైన భీమునికి ఆకలెక్కువ. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేని భోజన ప్రియుడు భీముడు. ఒకసారి వ్యాసమహర్షితో భీముడు తన తల్లి, సోదరులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారని తాను నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండలేనని, మోక్షాన్ని పొందటానికి సంవత్సరంలో ఒక్కరోజు చేసే ఉపవాసం అయితే చేయగలనని అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాసుడు జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆహారం మాత్రమే కాకుండా కనీసం జలం కూడా తీసుకోకుండా నిష్టగా ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు విరివిగా చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతాడు.
భీముని ఏకాదశి
వ్యాసుని సలహా మేరకు భీముడు నీరు అంటే జలం కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, ఇతర దానాలు చేసి సంతుష్టి పరచి మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని, భీముని ఏకాదశి అని పాండవ ఏకాదశి అని అంటారు.
నిర్జల ఏకాదశి రోజు ఎవరిని పూజించాలి?
అక్షయ తృతీయ కంటే పవిత్రమైనదిగా భావించే నిర్జల ఏకాదశి రోజు నిష్టతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారికి కూడా సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ చిత్ర పటం కానీ ఉంచుకొని పూజ ప్రారంభించాలి.
ముందుగా లక్ష్మీనారాయణులకు గంధం, కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణలకు భక్తి పూర్వకంగా నమస్కరించాలి. విష్ణుపూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి. తులసి లేకుంటే పూజ అసంపూర్ణం అవుతుంది. 108 సార్లు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. ఆ రోజంతా నీరు కూడా తాగకుండా పూర్తిగా ఉపవాసం ఉండాలి.
ఈ నైవేద్యాలు ప్రీతికరం
లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన పరమాన్నం ఈ రోజు తప్పనిసరిగా నివేదించాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పంజరి ప్రసాదాన్ని నివేదిస్తారు. ఫూల్ మఖానా, ధనియాలు విడి విడిగా వేయించి నెయ్యి, బెల్లం, యాలకులు వంటివి కలిపి పొడి లాగా తయారు చేసే ప్రసాదమే పంజరి. ఈ ప్రసాదం నారాయణునికి ప్రీతికరమైనది.