తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దుర్గుణరాశి 'నిష్టురి' కథ- నరక బాధలు అనుభవించిన కర్కశ- రెండో అధ్యాయం మీకోసం!

సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం- రెండో అధ్యాయం ఇదే!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 4:16 AM IST

Karthika Puranam 2nd Day In Telugu : పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజూ విన్నా చదివినా అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్ర వచనం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ఆటంకాలు తొలగించేది కార్తీక పురాణ పఠనం. ఇలాంటి పురాణాలు మనం ఉన్నవి ఉన్నట్లుగా యధాతధంగా మాత్రమే చదువుకోవాలి కానీ మన ఇష్టానుసారం వాటిని మార్చరాదు. ఈ కథనంలో కార్తీక పురాణం రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం.

వశిష్ఠుడు జనకునితో "ఓ జనకమహారాజా! ఇంతవరకూ నీకు కార్తీకమాసమునందు ఆచరించవలసిన విధివిధానాలు మాత్రమే తెలియచేసితిని. కార్తీకమాసములో సోమవారం వ్రతవిధానమును, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడై ఆలకించుము" అని ఈ విధముగా చెప్పసాగెను.

దుర్గుణరాశి 'నిష్టురి' కథ
పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే ఆమెకు ఎటువంటి సద్గుణాలు లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాల కారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు. నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించి, చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసమూ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావడంవల్ల కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ అతడు భార్యపై మనసు చంపుకోలేక పోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప, ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను, అతని తల్లిదండ్రులను హింస పెట్టేది.

భర్తను చంపిన కర్కశ
ఒకరోజు ఆమె చెలికాడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ ఉసిగొల్పగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్లి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా, తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బులపాలయింది. పూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది. విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడిన వారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్లి శిక్షించారు.

నరక బాధలు అనుభవించిన కర్కశ
భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతి మీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసిన పాపాలకు గానూ ముందు పది తరాలు, వెనుక పది తరాలు, ఆమెతో కలిసి 21 తరాల వాళ్ళను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది.

కుక్కగా జన్మించిన కర్కశ - పూర్వజన్మ స్మృతి
15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి, శివాభిషేకం మొదలైనవి చేసి, నక్షత్ర దర్శనానంతరం ప్రసాద స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష వేళ ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం తినడం వల్ల దానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడా! నన్ను రక్షించు'' అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.

గత జన్మ పాపాలకు కుక్క పశ్చాత్తాపం
అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టాను. పతితను, భ్రష్టను అయి, భర్తను కూడా చంపాను. ఆ పాపాల వల్ల నరకానికి వెళ్లాను'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది. చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటం లేదు. దయచేసి చెప్పు'' అంది.

బలి భక్షణంతో పూర్వజన్మ జ్ఞానం
బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమా! ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా. అందువల్ల నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది'' అన్నాడు. దానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.

కార్తీక సోమవారం వ్రతఫలాన్ని ధారబోసిన విప్రుడు - కుక్కకు మోక్షం
దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరిణియై కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా! నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు. ఇతి స్మాందపురాణ కార్తీకమహాత్మ్యే ద్వితీయాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details