Kadapa Venkateswara Swamy Brahmotsavam :తిరుమల శ్రీవారికి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లే టీటీడీ ఆధ్వర్యంలోని కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా దేవుని కడప శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ విశేషాలను, బ్రహ్మోత్సవ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవుని కడప ఎక్కడుంది?
తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడప ఆంధ్రప్రదేశ్, వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలో గల చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం కడప నగర పరిధిలోని "దేవుని కడప" అనే ప్రాంతంలో ఉంది.
దేవుని కడప పేరు ఇందుకే!
దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడు చోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ఇతర క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది.
ఆలయ విశేషాలు
దేవుని కడపలో వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. విజయనగర రాజులు, నంద్యాల రాజులు, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామి గురించి 12 కీర్తనలు చేశాడు.
హనుమ క్షేత్రం
దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వరుడు గుడిలో ఒక మందిరంలో ఉంటే ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. గర్భగుడి వెనుక వైపు ఇక్కడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహముంది. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డ నామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.
ఇతర దేవీ దేవతల ఉపాలయాలు
ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ ఆళ్వారు, హన్మత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. అలాగే విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం చూడదగినవి.
బల్లి స్పర్శతో పాపాలు మాయం
దేవుని కడపలో కంచి తరహాలో ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.
మతసామరస్యం
దేవుని కడపలో మరో విశిష్టత ఏమిటంటే మతసామరస్యం. ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ముస్లిం సోదరులు శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు. బీబీనాంచారమ్మను వారు తమ ఇంటి ఆడబిడ్డ గా భావించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా స్వామివారికి సారె ఇచ్చి ఉగాది పండగకి వారి ఇంటికి ఆహ్వానిస్తారు. అలాగే రథసప్తమి రోజు స్వామి రథాన్ని లాగడంలో అందరూ పాల్గొంటారు.
పూజలు ఉత్సవాలు
దేవుని కడపలో నిత్యం తిరుమల తరహాలోనే పూజాదికాలు జరుగుతాయి. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు, తిరుప్పావై వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల షెడ్యూల్
- జనవరి 28 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
- జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
- వాహన సేవలు
- జనవరి 29వ తేదీన రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
- జనవరి 30 వ తేదీ ఉదయం సూర్యప్రభవాహనంపై, రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
- జనవరి 31వ తేదీన ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి సింహ వాహనంపై ఊరేగుతాడు.
- ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం పై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
- ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం ముత్యపుపందిరి వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై ఊరేగుతాడు.
- ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. ఇక ఆ రోజు రాత్రి గజ వాహనంపై స్వామి ఊరేగుతాడు.
- ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 5 వ తేదీన ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు విహరిస్తారు.
- ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి హంసవాహన సేవ, అనంతరం జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
- ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
బ్రహోత్సవాల సందర్భంగా దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామిని మనం కూడా దర్శించుకుందాం. ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.